Trump posts: ట్రూత్ సోషల్‌లో ట్రంప్ దూకుడు.. గంటలోనే 34 పోస్టులతో సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ ఖాతాలో అనూహ్యంగా పోస్టుల వెల్లువ కొనసాగించారు. కేవలం గంట వ్యవధిలోనే ఏకంగా 34 పోస్టులు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించిన చిత్రాలతోపాటు ఆసక్తికర వ్యాఖ్యలను ఆయన పంచుకున్నారు. ఈ పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇరాన్‌కు చెందిన కీలక చమురు ఎగుమతి కేంద్రం ఖర్గ్ ద్వీపం ప్రస్తావన ట్రంప్ పోస్టుల్లో ప్రత్యేకంగా కనిపించింది. ఆ ద్వీపాన్ని ఉద్దేశిస్తూ 'బై బై ఖర్గ్' అంటూ ఆయన ఓ పోస్టు పెట్టారు. అంతేకాకుండా ఇరాన్ పటంపై తన ముఖం ప్రతిబింబించేలా రూపొందించిన ఏఐ చిత్రాన్ని కూడా ట్రంప్ షేర్ చేశారు. ఈ వరుస పోస్టులు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీశాయి.
వివరాలు
'చంద్రుడు మాకే సొంతం'
చంద్రుడిపై కూడా ట్రంప్ ఓ ఆసక్తికరమైన పోస్టు చేశారు.
'చంద్రుడు మాకే సొంతం' అనే భావన వచ్చేలా ఆయన చేసిన ఈ వ్యాఖ్య నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
దీనితోపాటు అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్ర సూచిక బోర్డును 'న్యూ అమెరికా'గా మార్చినట్లు కనిపించే ఓ చిత్రాన్ని కూడా ట్రంప్ పంచుకున్నారు.
అయితే న్యూ మెక్సికో రాష్ట్రం పేరును 'న్యూ అమెరికా'గా మార్చేందుకు ట్రంప్ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు.
ఆయన షేర్ చేసినది కేవలం ఓ చిత్రమేనని తెలుస్తోంది. కాగా.. గతంలో ట్రంప్ పలు ప్రాంతాల పేర్లను మార్చిన విషయం తెలిసిందే.
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మారుస్తూ ఆయన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు.