LOADING...
Trump: ట్రంప్ పోస్టుతో పాక్‌లో కలకలం.. షెహబాజ్ షరీఫ్‌ను పక్కన పెట్టి అసీమ్ మునీర్‌కు ప్రాధాన్యం
షెహబాజ్ షరీఫ్‌ను పక్కన పెట్టి అసీమ్ మునీర్‌కు ప్రాధాన్యం

Trump: ట్రంప్ పోస్టుతో పాక్‌లో కలకలం.. షెహబాజ్ షరీఫ్‌ను పక్కన పెట్టి అసీమ్ మునీర్‌కు ప్రాధాన్యం

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2026
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు ప్రస్తుతం పాకిస్థాన్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత ముస్లిం దేశాలు 'అబ్రహాం అకార్డ్స్'లో చేరాలని కోరుతూ చేసిన పోస్టులో ట్రంప్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేరు ప్రస్తావించకుండా ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ పేరును మాత్రమే ప్రస్తావించడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో పాకిస్థాన్‌లో అసలు అధికారం ఎన్నికైన ప్రభుత్వానిదా? లేక సైన్యానిదా? అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది.

వివరాలు 

షెహబాజ్ పేరు ఎక్కడా లేకుండా..

ట్రూత్ సోషల్‌లో చేసిన పెద్ద పోస్టులో ట్రంప్, తాను ఇటీవల మాట్లాడిన ప్రపంచ నేతల పేర్లను పేర్కొన్నారు. ఇందులో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసీ పేర్లు అధికారిక హోదాలతో పేర్కొన్నారు. కానీ పాకిస్థాన్ విషయానికి వస్తే ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేరు ఎక్కడా లేకుండా, నేరుగా ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీమ్ మునీర్ అహ్మద్ షా పేరును మాత్రమే పేర్కొన్నారు. దీంతో ఇది సాధారణ డిప్లొమాటిక్ తప్పిదం కాదని, పాకిస్థాన్‌లో విదేశాంగం, జాతీయ భద్రత వంటి కీలక అంశాల్లో ఇప్పటికీ సైన్యమే అధిక ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

అబ్రహాం అకార్డ్స్‌తో పాక్‌కు ఇబ్బంది

ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పరుచుకునే 'అబ్రహాం అకార్డ్స్'లో మరిన్ని ముస్లిం దేశాలు చేరాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ వంటి దేశాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే పాకిస్థాన్ పరిస్థితి భిన్నంగా ఉంది. యూఏఈ, బహ్రెయిన్‌లా ఇజ్రాయెల్‌ను ఇప్పటివరకు పాక్ అధికారికంగా గుర్తించలేదు. స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడిన తర్వాతే ఇజ్రాయెల్‌తో సంబంధాలపై నిర్ణయం తీసుకుంటామని ఇస్లామాబాద్ ఎప్పటి నుంచో చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ను గుర్తిస్తే దేశంలో తీవ్ర వ్యతిరేకత రావచ్చని, రాజకీయ అస్థిరత నెలకొనే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

వివరాలు 

ట్రంప్ కాల్‌పై నిశ్శబ్దం

అమెరికా మీడియా సంస్థ Axios కథనం ప్రకారం, గత వారం ట్రంప్ పాకిస్థాన్ సహా కొన్ని అరబ్ దేశాల నేతలతో జరిగిన హై లెవల్ కాన్ఫరెన్స్ కాల్‌లో అబ్రహాం అకార్డ్స్ అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఆ ప్రతిపాదనపై పాల్గొన్న నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. అంతేకాదు, "ఇంకా లైన్‌లోనే ఉన్నారా?" అంటూ ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించినట్టు Axios తెలిపింది. ఈ ఘటన పాకిస్థాన్‌కు అసౌకర్యకర పరిస్థితిని తీసుకొచ్చిందని అంటున్నారు.

Advertisement

వివరాలు 

అసీమ్ మునీర్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం

ఇటీవల ప్రాంతీయ సంక్షోభాల సమయంలో అసీమ్ మునీర్ పాకిస్థాన్‌లో కీలక నిర్ణయాధికారిగా ఎదుగుతున్నట్టు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్, అఫ్గానిస్థాన్, అమెరికాతో సంబంధాల విషయంలో ఆయన పాత్ర పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ తన అంతర్గత వర్గాలతో మునీర్‌కు నేరుగా సంబంధాలు ఏర్పడ్డాయని, గత ఏడాది ఇద్దరి మధ్య ప్రత్యేక భేటీ కూడా జరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ ఒత్తిడిని తిరస్కరిస్తే అమెరికాతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. మరోవైపు ఇజ్రాయెల్‌కు దగ్గరవుతే దేశీయంగా భారీ వ్యతిరేకత ఎదురయ్యే పరిస్థితి పాకిస్థాన్ ముందు నిలిచింది.

Advertisement