LOADING...
Iran vs Trump: ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్ వ్యాఖ్యలు.. అమెరికాపై ఇరాన్ ఘాటు విమర్శలు
ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్ వ్యాఖ్యలు.. అమెరికాపై ఇరాన్ ఘాటు విమర్శలు

Iran vs Trump: ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్ వ్యాఖ్యలు.. అమెరికాపై ఇరాన్ ఘాటు విమర్శలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కొత్త దౌత్య వివాదానికి దారితీశాయి. ఖమేనీ మృతిపై ప్రజలు వ్యక్తం చేస్తున్న సంతాపాన్ని ఉద్దేశిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాకు నాగరికత, చరిత్ర, గౌరవం లేవంటూ ఘాటుగా విమర్శించింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. ఖమేనీ అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రజలు ఖమేనీని ద్వేషిస్తారని తాను భావించానని, ప్రస్తుతం కనిపిస్తున్న శోకం నిజమైనది కాకపోవచ్చని వ్యాఖ్యానించారు. అది నకిలీ సంతాపం అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

వివరాలు 

ఎక్స్ వేదికగా స్పందించిన ఇరాన్ రాయబార కార్యాలయం

అంతేకాదు,ఇరాన్ ఉన్నత నాయకత్వం మొత్తం ఒకేచోట ఉందని, తాము అనుకుంటే వారిని ఒక్క దాడితో లక్ష్యంగా చేసుకోవచ్చని ట్రంప్ అన్నారు. అయితే భవిష్యత్‌లో చర్చలు జరిపేందుకు నాయకత్వం అవసరం కావడంతో అలాంటి చర్యలకు పాల్పడలేదని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై అర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించింది. "వ్యక్తులను హత్య చేయవచ్చు.. కానీ వారి ఆశయాలను ఎన్నటికీ అంతం చేయలేరు. మీరు అయతొల్లా ఖమేనీని చంపి ఉండవచ్చు. అది ఒక సువాసన ద్రవ్యాల సీసాను పగులగొట్టినట్టే. సీసా పగిలినా దాని పరిమళం అన్ని వైపులా వ్యాపిస్తుంది. ఆ పరిమళాన్ని మాత్రం ఎవరూ నాశనం చేయలేరు" అని పేర్కొంది. అలాగే అమెరికాకు నాగరికత,చరిత్ర, గౌరవం లేవంటూ తీవ్ర విమర్శలు చేసింది.

వివరాలు 

"అమెరికాకు మరణం" అంటూ నినాదాలు

ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడిలో ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. అనంతరం టెహ్రాన్‌లో జరిగిన అంత్యక్రియలకు లక్షలాది మంది హాజరై "అమెరికాకు మరణం" అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌లో అధికారిక సంతాప దినాలు ముగిసిన తర్వాత ఇరు దేశాల మధ్య చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు.

Advertisement