LOADING...
Epstein files: ఎప్‌స్టీన్ రహస్య ఫైళ్ల విడుదలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ 
ఎప్‌స్టీన్ రహస్య ఫైళ్ల విడుదలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్

Epstein files: ఎప్‌స్టీన్ రహస్య ఫైళ్ల విడుదలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైంగిక నేరాలకు పాల్పడ్డ జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన రహస్య పత్రాలను బయటపెట్టాలని న్యాయ శాఖను ఆదేశించే బిల్లుపై తాను సంతకం చేశానని వెల్లడించారు. రాజకీయ ఒత్తిడికి లొంగినట్టుగా కనిపించే ఈ నిర్ణయం ట్రంప్ అనుచరులకు, ప్రతిపక్షానికి కూడా ఊహించని పరిణామంగా మారింది. సోషల్ మీడియాలో ఆయన... "మా విజయాలపై ప్రజల దృష్టి పడకుండా చేయడానికి డెమొక్రాట్లు 'ఎప్‌స్టీన్ ఫైళ్ల' అంశాన్ని ఉపయోగిస్తున్నారు" అంటూ విమర్శలు గుప్పించారు.

వివరాలు 

కేసులో వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాలనుకునే ప్రజల్లో ఆశ 

'ఎన్‌డీటీవీ' వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ బిల్లు 'ఎప్‌స్టీన్ ఫైళ్లు పారదర్శకత చట్టం' పేరుతో కాంగ్రెస్‌లో రెండు పార్టీల మద్దతు పొందింది. ముఖ్యంగా మంగళవారం హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో 427-1 ఓట్ల భారీ మెజారిటీ‌తో బిల్లు ఆమోదం పొందటం ప్రత్యేకంగా నిలిచింది. ట్రంప్ మొదట్లో వ్యతిరేకించినప్పటికీ, రిపబ్లికన్లు సహా పెద్ద సంఖ్యలో చట్టసభ సభ్యులు పారదర్శకత వైపు నిలిచారు. ఈ పరిణామం ఎప్‌స్టీన్ బాధితులకు కొంత ఉపశమనం కలిగించగా.. ఈ కేసులో వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాలనుకునే ప్రజల్లో ఆశ పెంచింది. చట్టం ప్రకారం డీఓజే (న్యాయ శాఖ) ఎప్‌స్టీన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు, కమ్యూనికేషన్‌లు మొత్తం 30 రోజుల్లో విడుదల చేయాలి.

వివరాలు 

బిల్లులో కొన్ని మినహాయింపులు

2019లో ఫెడరల్ జైలులో ఎప్‌స్టీన్ మరణంపై జరిగిన విచారణకు చెందిన వివరాలు కూడా ఇందులో భాగమవుతాయి. ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకున్నారని అధికారికంగా చెప్పినా, ఆయన మరణంపై ఉన్న అనుమానాలు, కుట్ర సిద్ధాంతాలు తగ్గకపోవడంతో ఈ నిర్ణయానికి మరింత ప్రాధాన్యం వచ్చింది. అయితే బిల్లులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. కొనసాగుతున్న దర్యాప్తులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, బాధితుల వివరాలకు సంబంధించి కొన్ని భాగాలను రహస్యంగా ఉంచేందుకు (Redactions) అనుమతి ఉంటుంది. రాజకీయంగా చికాకులు కలిగించే సమాచారం ఉన్నా, అవి బహిర్గతం చేయాల్సిందేనన్నది ఈ చట్టం స్పష్టమైన ఉద్దేశ్యం. త్వరలోనే ఎప్‌స్టీన్ ఫైళ్లు వెల్లడి కానుండటంతో, దీనిలో ఏయే ప్రముఖుల పేర్లు బయటపడతాయో అనే ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.