
Donald Trump: అమెరికా విద్యాశాఖ మూసివేత.. ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు.
అధికారాన్ని చేపట్టినప్పటి నుండి కీలక నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.వలస నియంత్రణను కఠినతరం చేస్తూ,పలు దేశాలపై ప్రయాణ నిషేధాన్ని విధించి సంచలనాన్ని సృష్టించారు.
తాజాగా,యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్యా శాఖను రద్దు చేస్తూ ఓ అధికారిక ఉత్తర్వుపై సంతకం చేశారు.
వైట్ హౌస్ తూర్పు గదిలోని డెస్క్‌ల వద్ద పాఠశాల పిల్లల సమక్షంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సంతకం చేశారు.
ఆ తర్వాత ట్రంప్ చిరునవ్వుతో ఆ ఉత్తర్వును పైకెత్తి చూపించారు.ఈ నిర్ణయంతో సమాఖ్య విద్యా శాఖను శాశ్వతంగా రద్దు చేయడం ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు.
వివరాలు
విద్యా శాఖ ఉదారవాద భావజాలంతో ప్రభావితమైందని
ట్రంప్ ప్రకారం, విద్యా శాఖ అనవసరమైపోయిందని, అది ఉదారవాద భావజాలంతో ప్రభావితమైందని అభిప్రాయపడ్డారు.
అమెరికాలో ఖర్చును తగ్గించేందుకు, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం అవసరమని తెలిపారు.
అయితే, ఈ శాఖ పూర్తిగా మూసివేయబడదు. కొన్ని కీలక విధులు మాత్రం కొనసాగుతాయని వైట్ హౌస్ వెల్లడించింది.
1979లో స్థాపించిన విద్యా శాఖను కేవలం అధ్యక్ష ఉత్తర్వుతోనే రద్దు చేయలేము. దీనికి కాంగ్రెస్ ఆమోదం అవసరమని స్పష్టం చేశారు.
దీని కోసం త్వరలోనే ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు రిపబ్లికన్లు ప్రకటించారు.