LOADING...
H-1B visa: ట్రంప్‌ కొత్త వీసా వ్యాఖ్యలపై వివాదం: క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్‌ 
ట్రంప్‌ కొత్త వీసా వ్యాఖ్యలపై వివాదం: క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్

H-1B visa: ట్రంప్‌ కొత్త వీసా వ్యాఖ్యలపై వివాదం: క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశీ ఉద్యోగుల నియామకంపై కఠిన ధోరణి పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆయన హెచ్-1బీ వీసాలను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు మద్దతుదారుల్లో తీవ్ర అసంతృప్తిని రేపాయి. ఈ వివాదంపై వైట్‌హౌస్‌ తాజా వివరణ ఇచ్చింది. విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధానాలకు పాటుపడుతున్నప్పటికీ, అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను కాపాడటం ట్రంప్‌ ప్రధాన లక్ష్యమని స్పష్టంచేసింది.

వివరాలు 

హెచ్-1బీ వీసాలపై కూడా దృష్టి

వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ జర్నలిస్టులతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. "అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులతో భర్తీ చేయాలనే ఉద్దేశ్యం ట్రంప్‌కు అసలు లేదు. అమెరికా తయారీ రంగం మరింత బలపడాలని ఆయన కోరుతున్నారు.అందుకే కొన్ని దేశాలపై సుంకాలు విధించడం,కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి చర్యలు తీసుకున్నారు. తాజాగా హెచ్-1బీ వీసాలపై కూడా దృష్టి పెట్టారు. విదేశీ కంపెనీలు అమెరికాలో ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టే సందర్భంలో,బ్యాటరీలు వంటి ప్రత్యేక ఉత్పత్తుల తయారీకి తాత్కాలికంగా విదేశీ నిపుణులను తెచ్చుకోవడాన్ని ట్రంప్‌ అంగీకరిస్తున్నారు. కానీ తర్వాత ఆ ఉద్యోగాల్లో అమెరికన్లను నియమించాలనే షరతును ఆయా కంపెనీలు తప్పనిసరిగా అమలు చేయాలి.

వివరాలు 

 'అమెరికా ఫస్ట్‌' నినాదానికే కట్టుబడి ఉన్న ట్రంప్‌ 

అమెరికాలో వ్యాపారం చేయాలనుకునే సంస్థలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం తప్పనిసరి అని ట్రంప్‌ ఇప్పటికే స్పష్టం చేశారు" అని లీవిట్‌ తెలిపారు. ట్రంప్‌ మొదటి నుంచీ 'అమెరికా ఫస్ట్‌' నినాదానికే కట్టుబడి ఉన్నారు. నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులకు జారీ చేసే హెచ్-1బీ వీసాల విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్ల వరకు పెంచేసి పెద్ద సంచలనానికి కారణమయ్యారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేపింది. విదేశీయుల కారణంగా అమెరికన్లు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆయన పునరుద్ఘాటించారు.

వివరాలు 

అమెరికన్లకు నైపుణ్యాలు నేర్పించాలి

అయితే తాజాగా ట్రంప్‌ వైఖరిలో పెద్ద మార్పు కనిపించింది. హెచ్-1బీ వీసాల జారీ అవసరాన్ని ఆయన అంగీకరించారు. విదేశీ నిపుణులు అమెరికా కంపెనీల అభివృద్ధికి అవసరమని చెప్పారు. బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ కంపెనీలకు విదేశీ ఉద్యోగుల అవసరం తప్పదని అర్థం చేసుకున్నారు. కానీ ఒక నిబంధనను మాత్రం కచ్చితంగా పెట్టారు—విదేశీ ఉద్యోగులు ఇక్కడ పనిచేసే సమయంలో అమెరికన్లకు నైపుణ్యాలు నేర్పించాలి; తరువాత తమ దేశాలకు తిరిగి వెళ్లాలి అని స్పష్టంచేశారు.