Loading...
Trump: మైక్రోసాఫ్ట్‌, ఎడోబ్‌కు ట్రంప్‌ సర్కారు షాక్‌.. గ్రీన్‌కార్డు ప్రోగ్రామ్‌ నుంచి సస్పెండ్
గ్రీన్‌కార్డు ప్రోగ్రామ్‌ నుంచి సస్పెండ్

Trump: మైక్రోసాఫ్ట్‌, ఎడోబ్‌కు ట్రంప్‌ సర్కారు షాక్‌.. గ్రీన్‌కార్డు ప్రోగ్రామ్‌ నుంచి సస్పెండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2026
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో మైక్రోసాఫ్ట్‌, టాటా, ఇన్ఫోసిస్‌, విప్రో సహా ఎనిమిది ప్రముఖ ఐటీ కంపెనీలకు డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం కీలక షాక్‌ ఇచ్చింది. హెచ్‌-1బీ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డులు పొందేందుకు కంపెనీలు దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో కీలకమైన పర్మినెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ (పర్మ్‌) నుంచి వాటిని సస్పెండ్‌ చేసింది. హెచ్‌-1బీ వీసాలు, విదేశీ ఉద్యోగుల నియామక నిబంధనలను ఈ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, తద్వారా అమెరికన్ల ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్‌, టాటా, ఇన్ఫోసిస్‌, విప్రోతో పాటు కాగ్నిజెంట్‌, హెచ్‌సీఎల్‌, క్యాప్‌జెమిని, ఎడోబ్‌ ఉన్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, కార్మిక శాఖ మంత్రి కీథ్‌ సాండర్లింగ్‌ గురువారం శ్వేతసౌధంలో ఈ విషయాన్ని ప్రకటించారు.

వివరాలు 

పర్మ్‌ ప్రోగ్రామ్‌ నుంచి సస్పెండ్

కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, టాటా, విప్రో, హెచ్‌సీఎల్‌, క్యాప్‌జెమిని సంస్థలను పర్మ్‌ ప్రోగ్రామ్‌ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు సాండర్లింగ్‌ వెల్లడించారు.

పలు ఆరోపణలపై ఫెడరల్‌ దర్యాప్తులు కొనసాగుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌, ఎడోబ్‌లపైనా ఇదే చర్య తీసుకున్నట్లు తెలిపారు.

ఈ ఎనిమిది ఐటీ ఔట్‌సోర్సింగ్‌ కంపెనీల నుంచి కొత్త పర్మినెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు.

ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా ప్రాసెస్‌ చేయబోమని పేర్కొన్నారు.

వివరాలు 

మైక్రోసాఫ్ట్‌పై జేడీ వాన్స్‌ విమర్శలు

మైక్రోసాఫ్ట్‌ వ్యవహారంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తీవ్ర విమర్శలు చేశారు.

2025లో ఆ సంస్థ ఆరు వేల మంది అమెరికన్‌ ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించిందని, ఆ తర్వాత 6,300 హెచ్‌-1బీ వీసాలను పొందిందని తెలిపారు.

దాదాపు మూడు వేల గ్రీన్‌కార్డులను కూడా దక్కించుకుందని పేర్కొన్నారు.

ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ, మైక్రోసాఫ్ట్‌ తొలగించిన ప్రతి అమెరికన్‌ ఉద్యోగికి సగటున ఒకటిన్నర మంది విదేశీ కాంట్రాక్టు ఉద్యోగులను నియమించినట్లుగా ఉందని వాన్స్‌ వ్యాఖ్యానించారు.

హెచ్‌-1బీ వీసాల ద్వారా నియమితులయ్యే విదేశీ ఉద్యోగులను ఆయన 'విదేశీ కాంట్రాక్టు పనివాళ్లు'గా, ఈ విధానాన్ని ఉపయోగించుకునే కంపెనీలను 'వీసా మిల్లులు'గా అభివర్ణించారు.

ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం మైక్రోసాఫ్ట్‌ చిన్న పట్టణ పత్రికలో ప్రకటనలు ఇస్తోందని వాన్స్‌ ఆరోపించారు.

ADVERTISEMENT

వివరాలు 

విశ్వవిద్యాలయాల్లో జే-1 వీసాల వినియోగంపై దర్యాప్తు

ఆ ప్రకటనలకు అమెరికన్ల నుంచి స్పందన రాలేదని చెబుతూ, వారి స్థానాల్లో విదేశీ కాంట్రాక్టు ఉద్యోగులకు అవకాశాలు కల్పిస్తోందని విమర్శించారు.

యేల్‌, హార్వర్డ్‌, స్టాన్‌ఫోర్డ్‌, కాల్టెక్‌ సహా తొమ్మిది ప్రముఖ విశ్వవిద్యాలయాలు పరిశోధకుల కోసం జే-1 వీసా ప్రోగ్రామ్‌ను ఉపయోగించుకుంటున్న తీరుపై కూడా జేడీ వాన్స్‌ దర్యాప్తునకు ఆదేశించారు.

ఈ విశ్వవిద్యాలయాలు జే-1 వీసాలను అధికంగా ఉపయోగించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

అమెరికా గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు, పరిశోధకులకు చెల్లించే వేతనాలపై ప్రభావం పడేలా ఈ వీసాలను దుర్వినియోగం చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ సంస్థల్లో ఏదో అసాధారణంగా జరుగుతోందని వ్యాఖ్యానించారు.

జే-1 వీసా ప్రోగ్రామ్‌ ద్వారా విదేశీయులు పరిశోధన, బోధన, విద్య, ప్రత్యేక వృత్తిపరమైన పనులు వంటి కార్యకలాపాల కోసం ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్లుగా అమెరికాలోకి ప్రవేశించవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

2009 నుంచి 30 లక్షల మంది విదేశీ ఉద్యోగుల కోసం విన్నపాలు

ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయాలు ఎలా ఉపయోగించుకుంటున్నాయన్న అంశంపై దర్యాప్తు జరగనుంది.

ఈ ఎనిమిది కంపెనీలు 2009 నుంచి దాదాపు 30 లక్షల మంది విదేశీ ఉద్యోగుల కోసం దరఖాస్తులు లేదా విన్నపాలు సమర్పించాయని కార్మిక శాఖ మంత్రి కీథ్‌ సాండర్లింగ్‌ తెలిపారు.

ఈ సంస్థలు 2.30 లక్షలకు పైగా హెచ్‌-1బీ వీసాలకు ఆమోదం పొందాయని, లక్షకు పైగా పర్మినెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్లను దక్కించుకున్నాయని వివరించారు.

విదేశీ ఉద్యోగుల నియామకాల్లో ఈ కంపెనీలు అనుసరిస్తున్న విధానాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఈ గణాంకాలను కూడా ప్రస్తావించింది.

వివరాలు 

ఏమిటీ పర్మ్‌ ప్రోగ్రామ్‌?

అమెరికాలో విదేశీ ఉద్యోగులను శాశ్వతంగా నియమించుకునేందుకు కంపెనీలు అనుసరించాల్సిన కీలక ప్రక్రియే పర్మినెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ (పర్మ్‌).

ఈ ప్రక్రియలో భాగంగా, తమ సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు అవసరమైన నైపుణ్యాలు, అర్హతలు కలిగిన అమెరికన్‌ ఉద్యోగులు అందుబాటులో లేరని కంపెనీలు ముందుగా నిరూపించాలి.

అంతేకాకుండా విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం వల్ల అదే తరహా ఉద్యోగాలు చేస్తున్న అమెరికన్ల వేతనాలు, పని పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఉండదని భరోసా ఇవ్వాలి.

ఈ వివరాలను పరిశీలించిన తర్వాత అమెరికా కార్మిక శాఖ అనుమతి మంజూరు చేస్తుంది.

వివరాలు 

ఏమిటీ పర్మ్‌ ప్రోగ్రామ్‌?

ఆమోదం లభించిన అనంతరం కంపెనీలు అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్‌ సర్వీసుల విభాగాన్ని సంప్రదించి, ఇమ్మిగ్రెంట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తాయి.

ఇందుకోసం సాధారణంగా ఐ-140 ఫారాన్ని ఉపయోగిస్తాయి.

హెచ్‌-1బీ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులు ఉపాధి ఆధారంగా గ్రీన్‌కార్డు పొందేందుకు పర్మ్‌ ప్రక్రియ కీలకంగా ఉంటుంది.

ఈ కార్యక్రమం నుంచి కంపెనీలను సస్పెండ్‌ చేయడం వల్ల అర్హులైన విదేశీ ఉద్యోగుల తరఫున శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం క్లిష్టమవుతుంది.

ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రాసెసింగ్‌ నిలిచిపోవడం కూడా ఆయా ఉద్యోగుల గ్రీన్‌కార్డు ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ADVERTISEMENT