Loading...
Trump: ట్రంప్ కొత్త టారిఫ్‌లు.. భారత్‌తో పాటు 60 దేశాలపై పన్నుల భారం!
ట్రంప్ కొత్త టారిఫ్‌లు.. భారత్‌తో పాటు 60 దేశాలపై పన్నుల భారం!

Trump: ట్రంప్ కొత్త టారిఫ్‌లు.. భారత్‌తో పాటు 60 దేశాలపై పన్నుల భారం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2026
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా వాణిజ్య విధానాన్ని మరింత కఠినతరం చేసే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం, అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను రక్షించడం లక్ష్యంగా కొత్త టారిఫ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు భారత్, చైనా, బ్రిటన్ సహా ప్రపంచంలోని 60కిపైగా వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు అదనపు దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. ఈ కొత్త టారిఫ్‌లు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

వివరాలు 

భారత్, ఈయూ ఉత్పత్తులపై 10 శాతం సుంకం

అమెరికా ప్రభుత్వ వివరాల ప్రకారం.. వెట్టిచాకిరీ (Forced Labour) ద్వారా తయారయ్యే ఉత్పత్తుల దిగుమతులను అరికట్టేందుకు తగిన చట్టపరమైన నిషేధాలు లేని దేశాలపై మరింత కఠినంగా వ్యవహరించనున్నారు.

ఈ క్రమంలో చైనా, బ్రిటన్, జపాన్ వంటి దేశాల నుంచి దిగుమతి అయ్యే సంబంధిత ఉత్పత్తులపై గరిష్ఠంగా 12.5 శాతం వరకు టారిఫ్ విధించారు.

మరోవైపు వెట్టిచాకిరీ ఉత్పత్తులను నియంత్రించే చట్టాలు ఉన్నప్పటికీ, వాటి అమలులో తగిన పురోగతి లేదని భావిస్తున్న భారత్, శ్రీలంక, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై 10 శాతం దిగుమతి సుంకం అమలు చేయాలని నిర్ణయించారు.

వివరాలు 

భారత్‌పై విధించే సుంకాన్ని 10 శాతానికే పరిమితం

భారత్‌పై కూడా 12.5శాతం పెనాల్టీ టారిఫ్ విధించే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగినప్పటికీ, ఇటీవల వెట్టిచాకిరీ ఉత్పత్తుల నియంత్రణకు భారత్ తీసుకున్న చర్యలను అమెరికా వాణిజ్య ప్రతినిధులు పరిగణనలోకి తీసుకున్నారు.

దీంతో భారత్‌పై విధించే సుంకాన్ని 10 శాతానికే పరిమితం చేసినట్లు వెల్లడైంది.

అయితే ఈ కొత్త టారిఫ్‌ల నుంచి కొన్ని కీలక ఉత్పత్తులకు మినహాయింపు కల్పించారు.

చమురు, సహజవాయువు (గ్యాస్), అలాగే యూఎస్ఎంసీఏ (USMCA) వాణిజ్య ఒప్పందం పరిధిలోకి వచ్చే నిత్యావసర వస్తువులపై ఈ సుంకాలు వర్తించవని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా తయారీ రంగానికి పోటీగా నిలిచే దేశాలపై కఠిన వాణిజ్య చర్యలు

ఇదిలా ఉండగా, అధిక స్థాయిలో తయారీ సబ్సిడీలు అందిస్తున్న దేశాలపై భవిష్యత్తులో మరిన్ని టారిఫ్‌లు విధించే అవకాశాన్ని కూడా ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

అమెరికా తయారీ రంగానికి పోటీగా నిలిచే దేశాలపై మరింత కఠిన వాణిజ్య చర్యలు తీసుకునే దిశగా ట్రంప్ బృందం వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT