Donald Trump: EUపై 'అతి త్వరలో' 25% సుంకాలు..ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాల విధానంలో తన మిత్రులను కూడా మినహాయించడం లేదు.
ఆయన త్వరలోనే ఐరోపా సమాఖ్య (ఈయూ)పై 25% అదనపు టారిఫ్‌లు విధించనున్నట్లు వెల్లడించారు.
ఈయూ ఏర్పాటవ్వటమే అమెరికాను కట్టడి చేయడానికని, అందులో అది విజయవంతమైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
''మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. దానిని త్వరలో ప్రకటిస్తాం. 25% అదనపు టారిఫ్‌ను విధించాలని అనుకుంటున్నాం. అది కార్లు సహా అన్నింటిపైనా వర్తిస్తుంది. ఐరోపా సమాఖ్య అమెరికాను నియంత్రించడానికి ఏర్పడింది. అది తన పని బాగా చేసింది. కానీ ఇప్పుడు నేను అధ్యక్షుడిని'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వివరాలు
అమెరికా-ఈయూ వాణిజ్య సంబంధాలు
ప్రస్తుతం ఈయూ దిగుమతి చేసుకునే కార్లపై 10% టారిఫ్ విధిస్తోంది.
దీనికి అదనంగా వ్యాట్ (VAT),ఇతర పన్నులతో కలిపి మొత్తం 17.5% వరకు చేరుతుంది. అయితే, అమెరికా మాత్రం దిగుమతులపై కేవలం 2.5% మాత్రమే టారిఫ్ వసూలు చేస్తోంది.
ఐరోపా సమాఖ్య, అమెరికాకు మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.
అయితే, కెనడా, మెక్సికోలతో అమెరికా అత్యధిక వాణిజ్య సంబంధాలు కలిగి ఉంది.
ఇప్పటికే ట్రంప్ ఈ మూడు దేశాలపై అదనపు సుంకాలను విధించారు, ఇవి మార్చి 4వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి.
వివరాలు
ఈయూ, అమెరికాకు వరం
ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఈయూలో తీవ్ర సంచలనాన్ని రేపాయి. యూరోపియన్ కమిషన్ దీనిపై స్పందిస్తూ - ''ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఈయూ, అమెరికాకు వరంగా మారింది. స్వతంత్ర, పారదర్శక వాణిజ్యానికి వ్యతిరేకంగా ఉన్న అన్యాయపు నిర్ణయాలను ఈయూ తక్షణమే ఎదుర్కొంటుంది. ఈ అదనపు సుంకాలు చట్టాలకు, వివక్ష రహిత విధానాలకు సవాలు చేస్తాయి'' అని స్పష్టం చేసింది.
వివరాలు
చైనా-తైవాన్ సమస్యపై ట్రంప్ మౌనం
తైవాన్‌ను ఆక్రమించుకోవడానికి చైనాకు అమెరికా అనుమతిస్తుందా? అనే ప్రశ్నకు ట్రంప్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
''ఆ సమస్యపై ఎప్పుడూ వ్యాఖ్యానించను'' అని మాత్రమే చెప్పారు. అయితే, చైనాతో సీమాంతర పెట్టుబడుల విషయంలో మంచివాణిజ్య సంబంధాలను కొనసాగించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
యూఎస్ ఎయిడ్ కాంట్రాక్టుల రద్దు
అమెరికా ఇతర దేశాలకు అందించే యూఎస్ ఎయిడ్ నిధులకు సంబంధించి 90% కాంట్రాక్టులను రద్దు చేసింది. కానీ, కోర్టు కేసుల్లో ఉన్న కొన్ని ప్రాజెక్టులు మాత్రం కొనసాగుతున్నాయి.
ఈ విషయాన్ని కోర్టుకు సమర్పించిన ఒక పత్రంలో పేర్కొంది.