LOADING...
Trump: 'ఒప్పందానికి రండి.. లేకపోతే తీవ్ర చర్యలు తప్పవు'.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
'ఒప్పందానికి రండి.. లేకపోతే తీవ్ర చర్యలు తప్పవు'.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

Trump: 'ఒప్పందానికి రండి.. లేకపోతే తీవ్ర చర్యలు తప్పవు'.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. "మర్యాదగా మాతో ఒప్పందానికి రావాలి.. లేదంటే కథ ముగుస్తుంది" అంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలు రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణించగా, ప్రస్తుతం ఇరాన్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.

వివరాలు 

"ఒప్పందమో.. లేక కఠిన చర్యలో"

వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. "మేం చివరకు గెలుస్తాం. ఇరాన్‌తో ఒక ఒప్పందానికి వస్తాం.. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇరాన్‌ను దెబ్బతీయడం మాకు కష్టమైన పని కాదు. అయినప్పటికీ అక్కడ నివసిస్తున్న 91 మిలియన్లకు పైగా ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో నేను ఇప్పటికీ ఒప్పందానికే ప్రాధాన్యం ఇస్తున్నాను. అవసరమైతే కేవలం గంట వ్యవధిలోనే ఇరాన్‌లోని వంతెనలను ధ్వంసం చేసే సామర్థ్యం మాకు ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

వివరాలు 

అణ్వాయుధాలపై స్పష్టమైన హెచ్చరిక

ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదని ట్రంప్ స్పష్టం చేశారు. ఆ దేశంలో ఉన్న రేడియోధార్మిక పదార్థాలు, సంపన్న యురేనియంను స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. అలాగే అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొనే ముందు ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు మరింత తగ్గాయని చెప్పారు. కొన్ని కీలక రాయితీలు సాధించామని, వాటిని ఇరాన్ కొనసాగించాల్సిందేనని ఆయన అన్నారు.

Advertisement

వివరాలు 

కాల్పుల విరమణ ఉన్నా తగ్గని ఉద్రిక్తత

గత నెలలో అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరి కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ ట్రంప్ తన వైఖరిలో ఎలాంటి మార్పు చూపడం లేదు. జూలై 3న నిర్వహించిన ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ అగ్రనాయకత్వంతో పాటు మతాధికారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి.

Advertisement

వివరాలు 

"అవకాశం ఉన్నా మేం దాడి చేయలేదు"

అమెరికా మీడియా సంస్థ 'ఆక్సియోస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. "అక్కడ దేశ నాయకులంతా ఒకేచోట ఉన్నారు. ఒకే దెబ్బతో వారందరినీ మట్టుబెట్టే అవకాశం మాకు లభించింది. అయినప్పటికీ మేం అలా చేయలేదు. ఎందుకంటే వారందరినీ హతమార్చితే ఆ తర్వాత చర్చలు ఎవరితో జరపాలి?" అని ప్రశ్నించారు. ఖమేనీ అంత్యక్రియలకు భారీగా ప్రజలు తరలిరావడంపై స్పందిస్తూ, "చాలామంది ఇరాన్ ప్రజలు ఖమేనీకి వ్యతిరేకమని అనుకున్నాను. కానీ అంతమంది రావడం చూసి ఆశ్చర్యంగా ఉంది. బహుశా అవి నకిలీ కన్నీళ్లు కావచ్చు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

వివరాలు 

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం

ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఆర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా అమెరికాపై ఘాటు విమర్శలు చేసింది. జూలై 4న 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న అమెరికాకు నాగరికత, చరిత్ర, గౌరవం లేవంటూ విమర్శించింది. "మనుషులను చంపగలరు.. కానీ ఆదర్శాలను అంతం చేయలేరు.మీరు ఆయతుల్లా ఖమేనీని హతమార్చి ఉండొచ్చు.కానీ మీరు పగలగొట్టింది ఒక సెంట్ సీసా మాత్రమే.దాని సువాసన ఇప్పుడు అన్ని వైపులా వ్యాపించింది. ఈ విషయాలు మీకు అర్థం కావు. ఎందుకంటే అమెరికాకు నాగరికత లేదు, చరిత్ర లేదు, గౌరవం కూడా లేదు" అని ఇరాన్ పేర్కొంది. అలాగే ఖమేనీ అంత్యక్రియలకు తరలివచ్చిన భారీ జనసందోహాన్ని చూసైనా వాస్తవ పరిస్థితులను అమెరికా గుర్తించాలని ఇరాన్ హితవు పలికింది.

Advertisement