Iran: లావన్ చమురు కేంద్రం లక్ష్యంగా దాడి .. యూఏఈపై ఇరాన్ మిస్సైళ్ల వర్షం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు కొనసాగుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకున్నట్లు చెబుతున్న చర్య అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్‌లోని కీలక చమురు శుద్ధి కేంద్రంపై గత నెలలో యూఏఈ రహస్యంగా దాడులు నిర్వహించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ కథనం వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఐదు వారాల పాటు వైమానిక దాడులు కొనసాగించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇరాన్‌కు వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన లావన్ ద్వీపంలోని చమురు శుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు నివేదిక తెలిపింది.
వివరాలు
ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య క్షిపణి, డ్రోన్ దాడులు
రోజుకు సుమారు 60 వేల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే ఈ కేంద్రం ఇరాన్ ఇంధన వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. యూఏఈ చర్యలకు అమెరికా తెరవెనుక మద్దతు తెలిపినట్లు కూడా నివేదికలో పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలు ఈ వివాదంలో మరింతగా భాగస్వామ్యం కావడాన్ని అమెరికా స్వాగతించినట్లు సమాచారం. ఈ పరిణామాల తరువాత ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య క్షిపణి, డ్రోన్ దాడులు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో కాల్పుల విరమణ పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి.
వివరాలు
యూఏఈ, కువైట్‌లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు
లావన్ ద్వీప ఘటన తర్వాత ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగినట్లు ఆ దేశ ప్రభుత్వ మాధ్యమాలు ప్రకటించాయి. యూఏఈ, కువైట్‌లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు వెల్లడించాయి. అదే సమయంలో తమ ఇంధన, మౌలిక వసతులపై ఇరాన్ దాడులు చేసినట్లు యూఏఈ, కువైట్ కూడా ధృవీకరించాయి. పరస్పర దాడులతో ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం మరింత తీవ్రమైనట్లు కనిపిస్తోంది.