UK Graduate : బ్రిటన్‌లో భారతీయ విద్యార్థులకు రెండేళ్ల గ్రాడ్యుయేట్ వీసా.. అర్హతలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్‌లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు యూకే ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎంపిక చేసిన అర్హత కలిగిన విశ్వవిద్యాలయాల్లో చదువు పూర్తి చేసిన అంతర్జాతీయ విద్యార్థులకు రెండేళ్ల గ్రాడ్యుయేట్ వీసా ఇచ్చేందుకు నిర్ణయించింది. యూనివర్సిటీల నిబంధనల పాటింపు, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వాటి పనితీరు ఆధారంగా ఈ అర్హతను నిర్ణయించనున్నారు. ఈ వివరాలను బ్రిటన్ ప్రభుత్వం బడ్జెట్ పత్రంలో వెల్లడించింది.
వివరాలు
చదువు తర్వాత బ్రిటన్‌లో పని అనుభవానికి అవకాశం
2027 జనవరి 1 నుంచి బ్రిటన్‌లో బ్యాచిలర్స్,మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసిన సాధారణ అంతర్జాతీయ విద్యార్థులకు గ్రాడ్యుయేట్ వీసా గడువు రెండేళ్ల నుంచి 18నెలలకు తగ్గనుంది.
అయితే వలస నిబంధనలను పక్కాగా పాటిస్తూ,విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించే విశ్వవిద్యాలయాల్లో చదువు పూర్తి చేసిన వారికి మాత్రం రెండేళ్ల వీసా అందించనుంది.
దీంతో చదువు పూర్తయిన తర్వాత బ్రిటన్‌లో ఉండే గడువు విద్యార్థులు ఎంచుకున్న యూనివర్సిటీ అర్హతపై ఆధారపడి ఉంటుంది.
ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చనుంది.
చదువు పూర్తయిన తర్వాత బ్రిటన్‌లోనే ఉండి ఉద్యోగ అనుభవం సంపాదించాలనుకునే వారికి మరింత సమయం లభించనుంది.
అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించడంలో చదువు తర్వాత పనిచేసే అవకాశం కీలకంగా మారిందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
యూనివర్సిటీ ఎంపికలో కొత్త ప్రమాణాలు
ఇకపై యూనివర్సిటీలను ఎంపిక చేసుకునేటప్పుడు ర్యాంకింగ్స్‌తో పాటు వలస నిబంధనల పాటింపు, విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడంలో వాటి పనితీరును కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు.
మరోవైపు, ప్రపంచంలోని టాప్ 150 విశ్వవిద్యాలయాల్లో అర్హత కలిగిన డిగ్రీలు పొందిన వారికి వర్తించే హై పొటెన్షియల్ ఇండివిడ్యువల్ వీసా పరిధిని కూడా బ్రిటన్ విస్తరించింది.
ఈ పథకం కింద వీసాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. అయితే రెండేళ్ల గ్రాడ్యుయేట్ వీసాకు సంబంధించి 'హై కాంప్లయన్స్ యూనివర్సిటీ', 'మెరుగైన ఉద్యోగ ఫలితాలు' వంటి అర్హతలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ నిబంధనలను పారదర్శకంగా రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.