LOADING...
Braverman: వలస దేశాలే బ్రిటన్‌కు పరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి బ్రవెర్మన్
వలస దేశాలే బ్రిటన్‌కు పరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి బ్రవెర్మన్

Braverman: వలస దేశాలే బ్రిటన్‌కు పరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి బ్రవెర్మన్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు బ్రిటన్‌ పాలనలో ఉన్న వలస దేశాలు ఆ కాలంలో జరిగిన అభివృద్ధి వల్లే ముందుకు వచ్చాయని, అందుకే ఇప్పుడు ఆ దేశాలే బ్రిటన్‌కు తగిన మొత్తాన్ని చెల్లించాలని బ్రిటన్‌ మాజీ హోంశాఖ మంత్రి,ఎంపీ సువెల్లా బ్రవెర్మన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బానిసత్వం పేరుతో తమకు పరిహారం చెల్లించాలని బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3ను కోరేందుకు జమైకా ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో భారత సంతతికి చెందిన బ్రవెర్మన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్‌ పాలనలో ఉన్న సమయంలో వలస దేశాల అభివృద్ధి కోసం బ్రిటన్‌ భారీగానిధులు వెచ్చించిందని ఆమె పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అదే దేశాలు బ్రిటన్‌ను పరిహారం కోరడం సమంజసం కాదని, వాస్తవానికి బ్రిటన్‌కే వారు డబ్బుతిరిగి చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.

వివరాలు 

ప్రజాస్వామ్య దేశాలుగా ఎదిగిన అనేక దేశాల అభివృద్ధి వెనుక బ్రిటన్‌ పాత్ర

బానిసత్వ అంశాన్ని పక్కన పెడితే, బ్రిటిష్‌ సామ్రాజ్యం ప్రపంచ అభివృద్ధికి గణనీయమైన సేవలు అందించిందని బ్రవెర్మన్‌ అభిప్రాయపడ్డారు. 18వ శతాబ్దంలో జరిగిన పాలనకు సంబంధించి 21వ శతాబ్దంలోని బ్రిటిష్‌ పౌరుల నుంచి పరిహారం ఆశించడం చట్టపరంగా నిలబడదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య దేశాలుగా ఎదిగిన అనేక దేశాల అభివృద్ధి వెనుక బ్రిటన్‌ పాత్ర కూడా కీలకంగా ఉందని బ్రవెర్మన్‌ వ్యాఖ్యానించారు.

వివరాలు 

పరిహారం చెల్లించాలన్న జమైకా

ఇదిలా ఉండగా, సెప్టెంబర్‌ 6న ఒక ప్రతినిధి బృందం లండన్‌కు వెళ్లి రాజు ఛార్లెస్‌-3ను కలిసి బానిసత్వానికి సంబంధించి పరిహారం కోరనున్నట్లు జమైకా మంత్రి ఒలివియా గ్రాంజ్‌ సోమవారం తమ దేశ పార్లమెంటులో వెల్లడించారు. బానిసత్వ నిర్మూలన చట్టాన్ని అమలు చేయడానికి అప్పట్లో బ్రిటన్‌ ప్రభుత్వం సుమారు 2 కోట్ల పౌండ్లు సమీకరించిందని, ఆ చారిత్రక పరిణామాల నేపథ్యంలో తమకు పరిహారం చెల్లించాలని జమైకా వాదిస్తోంది.

Advertisement