UK Family Visa: UK కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
ఇమ్మిగ్రేషన్ ను అడ్డుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. కుటుంబ వీసా (UK Family Visa) నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బ్రిటిష్ పౌరులు, తమవారిని కుటుంబ సభ్యుల వీసాపై దేశానికి తీసుకురావాలంటే అందుకు కనీస వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచినట్లు యునైటెడ్ కింగ్‌డమ్ గురువారం ప్రకటించింది. ఇక నుంచి ఎవరైనా ఫ్యామిలీ వీసాకు స్పాన్సర్ చేయాలంటే.. వారి కనీస వార్షిక వేతనం, ఆదాయం £29,000 ఉండాలని యూకే ప్రభుత్వం స్పష్టం చేసింది.
పన్ను చెల్లింపుదారులపై భారం పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం:క్లెవర్లీ
గతంలో ఈ పరిమితి £18,600 ఉండగా.. ఇప్పుడు దాన్ని 55 శాతం పెంచారు. అంతేకాకుండా వచ్చే ఏడాది ప్రారంభంలో ఫ్యామిలీ వీసా వేతన పరిమితిని £38,700కి పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. చట్టపరమైన వలసలతో , బయటి నుండి వచ్చే వ్యక్తుల వల్ల పన్ను చెల్లింపుదారులపై భారం పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని బ్రిటన్ హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ తెలిపారు.