Ukraine attacks: భారత్‌కు చమురు పంపే రష్యా పోర్టులపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాలోని చమురు క్షేత్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ సోమవారం తెల్లవారుజామున భారీ స్థాయిలో డ్రోన్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారత్‌కు చమురు ఎగుమతి చేసే బాల్టిక్ సముద్రంలోని కీలకమైన వైసోట్స్క్,ఉస్ట్-లుగా పోర్టులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు రష్యా అధికారులు వెల్లడించారు. ఈ దాడుల సందర్భంగా 70కిపైగా ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా తెలిపింది. అయితే చమురు శుద్ధి కర్మాగారాలు,ఇంధన మౌలిక వసతులపై వరుసగా డ్రోన్ దాడులు జరుగుతుండటంతో ఇంధనం నింపే కేంద్రాల వద్ద కిలోమీటర్ల మేర ట్యాంకర్లు నిలిచిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. రష్యాలోని అతిపెద్ద ఓడరేవులలో ఉస్ట్-లుగా ఒకటి. మాస్కో ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే వ్యూహంలో భాగంగా ఉక్రెయిన్ గతంలో కూడా ఈ ఓడరేవుపై పలుమార్లు దాడులు చేసింది.
వివరాలు
లక్ష్యంగా కీలక చమురు ఎగుమతి కేంద్రం
తాజా దాడులతో మరోసారి ఈ కీలక చమురు ఎగుమతి కేంద్రం లక్ష్యంగా మారింది. రష్యా నుంచి భారత్‌కు వచ్చే మొత్తం ముడి చమురులో సుమారు 60 నుంచి 70 శాతం వరకు బాల్టిక్ సముద్ర మార్గం ద్వారానే రవాణా అవుతోంది. ముఖ్యంగా ఉస్ట్-లుగా, ప్రిమోర్స్క్ ఓడరేవుల నుంచి బయలుదేరే చమురు నౌకలు ఉత్తర సముద్రం, సూయజ్ కాలువ, ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించి భారత తీరాలకు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో రష్యాలోని ఈ కీలక ఓడరేవులు దెబ్బతింటే చమురు సరఫరా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని చమురు రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో భారత్‌కు రష్యా నుంచి చమురు రవాణాపైనా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.