Ukraine:పుతిన్ స్వస్థలంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జన్మస్థలం, దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన సెయింట్ పీటర్స్‌బర్గ్‌పై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు జరిపింది. మంగళవారం రాత్రి దీర్ఘశ్రేణి డ్రోన్‌లతో చమురు టెర్మినల్‌తో పాటు క్రోన్ట్సాడ్‌లో ఉన్న కీలక నౌకాదళ స్థావరం సహా పలు వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. ప్రతిష్ఠాత్మక సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (ఎస్‌పీఐఈఎఫ్) ప్రారంభానికి కొద్ది గంటల ముందే ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ దృష్టి ఈ నగరంపై కేంద్రీకృతమైన సమయంలో ఉక్రెయిన్ ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
యుద్ధనౌకలో మంటలు చెలరేగుతున్న వీడియో పోస్ట్ చేసిన జెలెన్‌స్కీ
ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ స్పందించారు. తమ డ్రోన్‌లు వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణించి నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేశాయని ఆయన బుధవారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. దాడి అనంతరం ఓ యుద్ధనౌకలో మంటలు చెలరేగుతున్న వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ సరిహద్దుకు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న టంబోవ్ ప్రాంతంలోని ఆయుధ తయారీ కర్మాగారం కూడా డ్రోన్ దాడికి గురైనట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. వివిధ ప్రాంతాలపై దూసుకొచ్చిన మొత్తం 354 డ్రోన్‌లను తమ వైమానిక రక్షణ దళాలు అడ్డుకున్నట్లు పేర్కొంది.
వివరాలు
మరింత ఉద్రిక్తంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
డ్రోన్‌ల శకలాలు పడటంతో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కొంత మేర విమానాల రాకపోకలను కూడా నిలిపివేశారు. మరోవైపు రష్యా ఆక్రమణలో ఉన్న క్రిమియా ప్రాంతంలో ఓ ప్రయాణికుల బస్సుపై జరిగిన దాడిలో ఎనిమిది మంది మృతిచెందినట్లు సమాచారం. తాజా పరిణామాలతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారుతోంది.