Page Loader
Zelenskyy: పుతిన్ కాల్పుల విరమణ కోరుకోవడం లేదు: జెలెన్స్కీ 
పుతిన్ కాల్పుల విరమణ కోరుకోవడం లేదు: జెలెన్స్కీ

Zelenskyy: పుతిన్ కాల్పుల విరమణ కోరుకోవడం లేదు: జెలెన్స్కీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2025
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉక్రెయిన్ అంగీకరించిన విషయం తెలిసిందే. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సూత్రప్రాయంగా అంగీకారాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కీవ్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించేందుకు పుతిన్‌ కారణాలను వెతుకుతున్నారని ఆయన ఆరోపించారు. గురువారం విడుదల చేసిన వీడియోలో ఈ విషయాన్ని వెల్లడించారు.

వివరాలు 

ఉక్రెయిన్లను నాశనం చేయాలన్నదే పుతిన్ లక్ష్యం 

'కాల్పుల విరమణను ఆలస్యం చేయడానికి, లేదా అమలుకాకుండా చేయడానికి పుతిన్‌ ప్రణాళిక రూపొందిస్తున్నారు. అసలు విషయాన్ని చూస్తే, ఆయన ఒప్పందాన్ని తిరస్కరించేందుకు కారణాలు వెతుకుతున్నారు. ఎందుకంటే, యుద్ధాన్ని కొనసాగిస్తూ, ఉక్రెయిన్లను నాశనం చేయాలన్నదే ఆయన అసలైన లక్ష్యం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముందు ఈ నిజాన్ని అంగీకరించడానికి ఆయన భయపడుతున్నారు. అందుకే కాల్పుల విరమణపై అనేక షరతులను విధిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఎలాంటి స్పష్టత రావడం కష్టమే. ఒకవేళ కాల్పుల విరమణ అమలైనా, అది ఎక్కువకాలం నిలవదు. దీర్ఘకాల భద్రత, శాశ్వత శాంతి వంటి అంశాలపై ఇప్పుడే చర్చలు జరగాలి' అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.

వివరాలు 

30 రోజుల కాల్పుల విరమణ

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలను సమాప్తి చేయడానికి ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సౌదీ అరేబియాలోని జెడ్డాలో ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్ ఆధ్వర్యంలో అమెరికా మంత్రులు,ఉన్నతాధికారుల బృందం, ఉక్రెయిన్‌ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో,30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ప్రతిపాదించగా, కీవ్‌ దానికి అంగీకారం తెలిపింది. పుతిన్‌ కూడా సూత్రప్రాయంగా అంగీకారం వ్యక్తం చేసినప్పటికీ, ఇంకా విధివిధానాలపై పూర్తి స్థాయి స్పష్టత అవసరమని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌ అమెరికా ఒత్తిడికి లోనై ఒప్పందాన్ని అంగీకరించినట్లు కనిపించినప్పటికీ,కీవ్‌ యుద్ధ పరిస్థితిని విశ్లేషించి నిర్ణయం తీసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా,ట్రంప్‌ ముందు పుతిన్‌ కృతజ్ఞతలు తెలిపారు.అంతేకాక,భారత్, చైనా,దక్షిణాఫ్రికా నాయకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.