LOADING...
Zelenskyy: ఖనిజాలపై అజమాయిషీ ఇచ్చేందుకు సిద్ధపడ్డ జెలెన్‌స్కీ.. రేపు అమెరికా పర్యటన 
ఖనిజాలపై అజమాయిషీ ఇచ్చేందుకు సిద్ధపడ్డ జెలెన్‌స్కీ.. రేపు అమెరికా పర్యటన

Zelenskyy: ఖనిజాలపై అజమాయిషీ ఇచ్చేందుకు సిద్ధపడ్డ జెలెన్‌స్కీ.. రేపు అమెరికా పర్యటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2025
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

స్వంత భూభాగాలను కాపాడుకోవడానికి రష్యాతో యుద్ధం చేస్తోన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా గత మూడేళ్లుగా అందించిన ఆయుధ, ఆర్థిక సహాయానికి ప్రతిగా అరుదైన, విలువైన ఖనిజాల రూపంలో కృతజ్ఞతను వ్యక్తపరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, ఉక్రెయిన్ భద్రతా వ్యవహారంలో అమెరికా మద్దతుగా ఉండాలని కీలక షరతును పెట్టారు. ఈ షరతుపై అమెరికా ఏ మేరకు ఒప్పుకుంటుందో శుక్రవారం నాటికి స్పష్టత రానుంది. జెలెన్‌స్కీ శుక్రవారం అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్‌తో భేటీ అయ్యి విస్తృతంగా చర్చలు జరపనున్నారు. చర్చలు విజయవంతమైతే, ముఖ్యమైన ఖనిజ, ఆర్థిక ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. అరుదైన ఖనిజాల డీల్‌ కుదిరాక, రష్యా వ్యతిరేక పోరాటంలో అమెరికా ఉక్రెయిన్‌కు ఎంతవరకు సహకరిస్తుందనే అనుమానాలు జెలెన్‌స్కీకి మిగిలే అవకాశం ఉంది.

వివరాలు 

అగ్రరాజ్య సహాయానికి ప్రతిఫలం 

ఇటీవల ఐక్యరాజ్యసమితి లో రష్యా వ్యతిరేక తీర్మానంలో అమెరికా మద్దతు ఇవ్వకపోవడంతో భద్రతా అంశంపై జెలెన్‌స్కీ మరింత పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో వందల బిలియన్‌ డాలర్ల ఆర్థిక, ఆయుధ సహాయం అందుకున్న ఉక్రెయిన్‌ ఇప్పుడు అమెరికా ఖనిజ సంపద డిమాండ్‌కు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై బుధవారం కీవ్‌లో జెలెన్‌స్కీ మీడియాతో మాట్లాడారు.

వివరాలు 

అమెరికా నుండి నేరుగా ఆయుధాలు కొనుగోలు

"అమెరికాలో ఆర్థిక ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాం.ఇది భవిష్యత్‌లో సమగ్ర ఒప్పందానికి మార్గం సుగమం చేస్తుంది. ఇందులో మా భద్రతా అంశమే అత్యంత ప్రాముఖ్యత పొందింది. అమెరికా పర్యటనలో ట్రంప్‌తో భేటీ అయి ఖనిజ వనరులపై పాక్షిక హక్కుల బదిలీతోపాటు యుద్ధానికి అవసరమైన ఆయుధసాయం గురించి చర్చిస్తాను. అమెరికా నుండి నేరుగా ఆయుధాలు కొనుగోలు చేయడం, అలాగే రష్యా పై ఆంక్షల ద్వారా నిలిపివేసిన ఆస్తులను మనం ఆయుధాల పెట్టుబడుల కోసం వినియోగించుకోవడంపై కూడా చర్చించనున్నా. అన్ని విషయాలు పరిష్కారమైతే, పూర్తి స్థాయిలో ఒప్పందంపై సంతకం చేస్తాను" అని జెలెన్‌స్కీ వెల్లడించారు.

వివరాలు 

"భారీ ఒప్పందం కుదుర్చుకుంటాం":ట్రంప్ 

మూడేళ్లుగా కొనసాగిన సహాయానికి ప్రతిఫలంగా ఖనిజ సంపదపై వాటా కోరుతున్న ట్రంప్‌ ఈ ఒప్పందంపై బుధవారం వాషింగ్టన్‌లో మంత్రివర్గ సమావేశం సందర్భంగా స్పందించారు. "జెలెన్‌స్కీ శుక్రవారం వాషింగ్టన్‌కు రానున్నారు. అతనితో కలిసి అతి పెద్ద ఒప్పందంపై సంతకాలు చేస్తాం. అమెరికన్ పౌరుల పన్నుల ద్వారా అందించిన నిధులు ఉక్రెయిన్‌కు యుద్ధ సహాయంగా ఉపయోగించాం. ఇప్పుడు, అరుదైన ఖనిజాల తవ్వకం ద్వారా ఈ మొత్తం తిరిగి రాబోతుంది. ఉక్రెయిన్‌తో దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం" అని ట్రంప్ తెలిపారు. అంతేగాక, "ఉక్రెయిన్‌ నాటో సభ్యత్వంపై ఆశలు వదులుకోవాలి. నాటో కూటమి కూడా ఈ అంశాన్ని ఇక మర్చిపోవడం మంచిది" అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

వివరాలు 

ప్రాథమిక ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ 

ఇరు దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం దాదాపుగా ఖరారైందని ఉక్రెయిన్‌ ప్రధాన మంత్రి డెనిస్‌ షెమిహాల్‌ బుధవారం వెల్లడించారు. "యుద్ధం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి, శాంతి స్థాపనకు, పెట్టుబడులకు సంబంధించి అమెరికాతో కీలక ఆర్థిక ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నాం" అని ఉక్రెయిన్‌ ప్రభుత్వ టెలివిజన్‌ ద్వారా ప్రకటించారు.