Russia: ఉక్రెయిన్ యుద్ధం రష్యాకు భారంగా మారుతోంది.. పెరుగుతున్న లోటుపై పుతిన్‌కు అధికారుల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధం రష్యాపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోందని ఆ దేశ ఉన్నతాధికారులు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇప్పటికే యుద్ధరంగంలో పెరుగుతున్న సైనిక నష్టాలు, భూభాగాల కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న రష్యా ఇప్పుడు ఆర్థికంగా కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ యుద్ధ ఖర్చుల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ నాటికి రష్యా ఆర్థిక లోటు 5.9 ట్రిలియన్ రూబిళ్లకు చేరుకుంది. అయితే మొత్తం 2026 సంవత్సరానికి ప్రభుత్వం అంచనా వేసిన లోటు 3.8 ట్రిలియన్ రూబిళ్లు మాత్రమే కావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
వివరాలు
పరిమితంగానే అత్యవసర నిధులు
ఈ నేపథ్యంలో రష్యా ఆర్థిక మంత్రి ఆంటన్ సిలువానోవ్ అరుదుగా బహిరంగ హెచ్చరిక చేశారు. ఉక్రెయిన్ యుద్ధం కోసం వినియోగిస్తున్న అత్యవసర నిధులు పరిమితంగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో ఆ నిధిలో దాదాపు 60 శాతం ఇప్పటికే ఖర్చయిందని తెలిపారు. మే 27న కొమ్మెర్సాంట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిలువానోవ్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యయాల్లో నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భారీ మార్పుల సమయంలో ఆర్థిక బలహీనతలను భరించలేమని, బడ్జెట్ ఖర్చుల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
వివరాలు
1.3 శాతం నుంచి 0.4 శాతానికి తగ్గిన 2026 వృద్ధిరేటు
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరగడం రష్యాకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం, ద్రవ్యోల్బణం రెండింటినీ ఒకేసారి ఎదుర్కొంటోంది. దీంతో 2026 వృద్ధిరేటు అంచనాను ప్రభుత్వం 1.3 శాతం నుంచి 0.4 శాతానికి తగ్గించింది. అంతేకాక, గత మూడేళ్లలో తొలిసారిగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రష్యా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ దళాలు రష్యా భూభాగంలోకి లోతుగా చొచ్చుకెళ్లి ఇంధన, మౌలిక వసతులపై దాడులు జరుపుతున్నాయి. ఈ దాడుల వల్ల చమురు ఉత్పత్తి, రవాణాపై ప్రభావం పడుతోంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ కోల్పోయిన దానికంటే ఎక్కువ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
వివరాలు
కీవ్ సహా ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై క్షిపణులు,డ్రోన్లతో రష్యా దాడులు
అధికారుల హెచ్చరికలు ఉన్నప్పటికీ పుతిన్ మాత్రం యుద్ధ వ్యూహంలో వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. గత కొద్ది వారాలుగా రష్యా కీవ్ సహా ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై క్షిపణులు,డ్రోన్లతో దాడులు ముమ్మరం చేసింది. ఈ దాడుల్లో డజన్ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా,వందల మంది గాయపడ్డారు. సైనిక వ్యయాలను తగ్గించేందుకు బదులుగా ఇతర శాఖల బడ్జెట్‌లో కోతలు పెట్టాలని పుతిన్ ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు సమాచారం. సైనిక ఖర్చులను చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే తగ్గించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వార్షిక లక్ష్యాన్ని 55 శాతం మేర అధిగమించిన ఆర్థిక లోటు ఉన్నప్పటికీ,రక్షణ శాఖ ఈ ఏడాదికి అదనంగా మరో 3 ట్రిలియన్ రూబిళ్ల నిధులు కోరింది.
వివరాలు
దేశ మొత్తం బడ్జెట్‌లో సుమారు 40 శాతం రక్షణ రంగానికే..
ప్రస్తుతం దేశ మొత్తం బడ్జెట్‌లో సుమారు 40 శాతం రక్షణ రంగానికే వెళ్తోంది. రష్యా పార్లమెంట్ సభ్యుడు రెనాట్ సులేమనోవ్ కూడా యుద్ధం వల్ల ఏర్పడుతున్న ఆర్థిక ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం బడ్జెట్‌లో 40 శాతం రక్షణ, భద్రత రంగాలకు వెళ్తున్నప్పుడు అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడటం కష్టమని వ్యాఖ్యానించారు. ట్యాంకులు, ఆయుధాలు ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించవని, అవి ద్రవ్యోల్బణాన్ని పెంచడంతో పాటు సామాజిక సేవలు, పెట్టుబడులపై ఖర్చును తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు.