LOADING...
UN: నేడు వెనిజులా వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి అత్యవసర భేటీ..
నేడు వెనిజులా వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి అత్యవసర భేటీ..

UN: నేడు వెనిజులా వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి అత్యవసర భేటీ..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం వెనిజులా పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. శనివారం అమెరికా వెనిజులాపై భారీ స్థాయిలో సైనిక దాడులు చేపట్టింది. ఈ దాడుల అనంతరం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను రాజధాని కారకాస్‌లో అదుపులోకి తీసుకున్న అమెరికా, వారిని అక్కడి నుంచి నేరుగా అమెరికాకు తరలించినట్లు సమాచారం. దాడులకు ముందే దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో వెనిజులా అంతా చీకట్లో మునిగిపోయింది. ఆ తర్వాత అధ్యక్షుడి కుటుంబాన్ని బంధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ బాంబు దాడుల కారణంగా సుమారు 40 మంది వరకు మృతి చెందినట్లు వెనిజులా అధికారులు తెలిపారు.

వివరాలు 

 కొలంబియా అభ్యర్థన మేరకు ఐక్యరాజ్య సమితిలో సమావేశం ఏర్పాటు 

ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ భద్రతా మండలి సమావేశం జరగనుందని ఐక్యరాజ్యసమితిలో సోమాలియా శాశ్వత ప్రతినిధి ఖాదీజా అహ్మద్ వెల్లడించారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న కొలంబియా అభ్యర్థన మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ అత్యవసర సమావేశానికి చైనా, రష్యా వంటి శాశ్వత సభ్యదేశాలు తమ మద్దతును ప్రకటించాయి. ఇదిలా ఉండగా, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌పై న్యూయార్క్‌లోని దక్షిణ జిల్లా కోర్టులో అభియోగాలు నమోదు చేసినట్లు అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండి తెలిపారు.

వివరాలు 

డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (DEA) కార్యాలయానికి నికోలస్ మదురో దంపతులు 

ఆదివారం న్యూయార్క్‌కు చేరుకున్న ఈ దంపతులపై నార్కో-టెర్రరిజం, కొకైన్‌ను అమెరికాకు అక్రమంగా తరలించేందుకు కుట్ర పన్నడం, అలాగే అమెరికాకు వ్యతిరేకంగా మెషిన్ గన్‌లు, విధ్వంసక పరికరాలను కలిగి ఉండేందుకు ప్రణాళిక రూపొందించడం వంటి తీవ్రమైన ఆరోపణలు మోపినట్లు ఆమె వెల్లడించారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం, నికోలస్ మదురో దంపతులను న్యూయార్క్ నగరంలోని డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (DEA) కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడికి తీసుకెళ్లే ముందు ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి మరోసారి అధికారికంగా కేసు నమోదు చేసి, నికోలస్ మదురో దంపతులను విచారించేందుకు అమెరికా అధికారులు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement