
India-Pakistan: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్గత సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ పరిణామాలను యావత్ ప్రపంచం గమనిస్తుండగా, ఇరు దేశాలూ శాంతిని పాటించాలని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ సూచించారు.
ఈ నేపథ్యంలోనే తాజా ఉద్రిక్తతలపై ఐరాస భద్రతా మండలిలో ఒక అంతర్గత (క్లోజ్డ్ డోర్) సమావేశం నిర్వహించారు.
వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని అనేక దేశాల రాయబారులు ఈ సమావేశంలో పిలుపునిచ్చారు.
వివరాలు
అంతర్జాతీయ వేదికను తన ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకోవాలన్న పాకిస్తాన్
ఈ రహస్య సమావేశం సుమారు గంటన్నరపాటు కొనసాగింది. అయితే, ఈ కొలిక్కి రాలేదని, ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం లేదు.
దీనిపై ఐరాస నుంచి అధికారిక ప్రకటన కూడా విడుదల కాలేదు. మరోవైపు, పాకిస్థాన్ మాత్రం ఈ అంతర్జాతీయ వేదికను తన ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకోవాలన్న ఉద్దేశంతో వ్యవహరించినట్లు తెలుస్తోంది.
సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేత అంశాన్ని పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తిఖర్ ప్రస్తావిస్తూ.. న్యూఢిల్లీపై నిందలు వేసినట్లు సమాచారం.
పాకిస్థాన్ చేసిన ఈ ఆరోపణలకు భారత్ గట్టి సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.
వివరాలు
సమావేశం తర్వాత ఐరాస ప్రతినిధి ఖిలారీ వ్యాఖ్యలు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం ముగిసిన అనంతరం,ఐరాస ప్రతినిధి మహమ్మదీ ఖిలారీ మీడియాతో మాట్లాడారు.
"ఇరు దేశాల మధ్య ప్రస్తుతం పరిస్థితి అస్థిరంగా ఉంది.ఈ ఉద్రిక్తత భరిత సమస్యకు చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం కోరుతూ భద్రతా మండలిలోని సభ్య దేశాలు పిలుపునిచ్చాయి" అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భద్రతా మండలి అధ్యక్షుడు ఎవాన్‌గెలోస్ సెక్రీస్ మాట్లాడుతూ,నిర్వహించిన చర్చలు సత్ఫలితాలకే దారితీశాయని వెల్లడించారు.
ఈ సమావేశానికి కొన్ని గంటల ముందే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ కీలక ప్రకటన చేశారు.
ఉగ్రదాడి ఘటన అనంతరం ప్రజల్లో నెలకొన్నభావోద్వేగాలను తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని గుటెరెస్ అన్నారు.
అయితే,ఇలాంటి సందర్భాల్లో సైనిక చర్యే పరిష్కారం కాదని స్పష్టం చేశారు.
వివరాలు
భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలు
ఇరు దేశాలూ మౌలిక తప్పిదాలకు లోనుకాకుండా, పరస్పరం సహనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇక మరోవైపు, భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి.
వరుసగా 12వ రోజూ పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడింది.
కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, నౌషెరా, సుందర్‌బనీ, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ బలగాలు కాల్పులు జరిపాయి.
అయితే, భారత సైన్యం వీటిని సమర్థంగా తిప్పికొట్టింది.