LOADING...
Canada: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌పై కెనడాలో కలకలం.. 'ఉగ్రవాద సంస్థ'గా గుర్తించాలంటూ లేఖ!
లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌పై కెనడాలో కలకలం.. 'ఉగ్రవాద సంస్థ'గా గుర్తించాలంటూ లేఖ!

Canada: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌పై కెనడాలో కలకలం.. 'ఉగ్రవాద సంస్థ'గా గుర్తించాలంటూ లేఖ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 12, 2025
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ దాడులు, నేరపరమైన చర్యలు పెరుగుతుండటంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల కపిల్‌ శర్మ కేఫ్‌పై రెండుసార్లు కాల్పులు జరగడం, ఈ ఘటనల్లో బిష్ణోయ్‌(Lawrence Bishnoi)గ్యాంగ్‌ ప్రమేయం ఉందన్న అనుమానాలు కలకలం రేపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, బిష్ణోయ్‌ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కన్జర్వేటివ్‌ పార్టీ, మార్క్‌ కార్నీ ప్రభుత్వానికి లేఖ రాసింది. సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ ముఠాపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని లేఖలో స్పష్టం చేశారు. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నేర సామ్రాజ్యం విస్తరిస్తోందని, కెనడా పౌరులను దోచుకోవడం, హత్య కేసుల్లో పాలుపంచుకోవడం వంటి అనేక నేరాల్లో వీరి పాత్ర ఉందని కెనడా ఎంపీ ఫ్రాంక్‌ కాపుటో తన లేఖలో ఆరోపించారు.

Details

ఉగ్రవాద సంస్థ జాబితాలోకి చేర్చాలి

స్థానికంగా, అంతర్జాతీయ స్థాయిలో అనేక హింసాత్మక ఘటనలకు తామే బాధ్యులమని ఈ గ్యాంగ్‌ ప్రకటించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. రాజకీయ, మతపరమైన, సైద్ధాంతిక కారణాలతో అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ ముఠాను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. దీంతో వీరి కార్యకలాపాలను అణచివేసేందుకు భద్రతా సంస్థలకు మరింత అధికారాలు లభిస్తాయని తెలిపారు. అలాగే ఈ ముఠా ఆగడాలపై ఇప్పటికే అనేక మంది కెనడా రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఫ్రాంక్‌ కాపుటో గుర్తు చేశారు.

Details

 బిష్ణోయ్‌ గ్యాంగ్‌పై చర్యలు తీసుకోవాలి

బ్రాంప్టన్‌ మేయర్‌ పాట్రిక్‌ బ్రౌన్‌ సహా నలుగురు కెనడియన్‌ నేతలు గతంలో ఇదే డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. బ్రిటీష్‌ కొలంబియా ప్రీమియర్‌ డేవిడ్‌ ఈబే, అల్బెర్టా ప్రీమియర్‌ డేనియల్‌ స్మిత్‌, సర్రీ మేయర్‌ బ్రెండా లాకీలు కూడా బిష్ణోయ్‌ గ్యాంగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరిన వారిలో ఉన్నారని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ స్థాయిలో ఇప్పటికే ఏకాభిప్రాయం ఏర్పడిందని కన్జర్వేటివ్‌ ఎంపీ ఫ్రాంక్‌ స్పష్టం చేశారు.