LOADING...
Cannes: కేన్స్‌లో కలకలం.. మిస్ వెనెజువెలాపై కత్తెరతో దాడి
కేన్స్‌లో కలకలం.. మిస్ వెనెజువెలాపై కత్తెరతో దాడి

Cannes: కేన్స్‌లో కలకలం.. మిస్ వెనెజువెలాపై కత్తెరతో దాడి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 22, 2026
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్ఠాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న వేళ ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆండ్రియా డెల్ వాల్ తనపై సెలబ్రిటీ స్టైలిస్ట్ గియోవన్నీ లగునా కత్తెరతో దాడి చేశాడని ఆరోపించారు. ఈ ఘటన కేన్స్‌లోని ఓ హోటల్ గదిలో జరిగినట్లు తెలుస్తోంది. ఆండ్రియా డెల్ వాల్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో ఆమె ముఖంపై రక్తపు గాయాలు కనిపించాయి. అలాగే హోటల్ గది మొత్తం చిందరవందరగా ఉండగా, స్టైలిస్ట్ జియోవన్నీ లగునా అక్కడే కూర్చుని కనిపించాడు. ఇది జియోవన్నీ లగునా చేసిన పని అంటూ ఆమె వీడియోలో ఆరోపించారు. ఈ ఘటన మంగళవారం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలు

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇద్దరి మధ్య మొదట వాగ్వాదం జరిగి, ఆ తర్వాత అది ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. హోటల్‌లో నుంచి అరుపులు, గొడవ శబ్దాలు వినిపించడంతో అక్కడి అతిథులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఘటనపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఫ్రాన్స్ పోలీసులు స్టైలిస్ట్ జియోవన్నీ లగునాను అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అతడిని పోలీసులు తీసుకెళ్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జియోవన్నీ లగునా లాటిన్ అమెరికా ఫ్యాషన్, బ్యూటీ ప్రపంచంలో ప్రముఖ స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందాడు. 2023 నుంచి మిస్ యూనివర్స్ కొలంబియా క్రియేటివ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

వివరాలు

ఇప్పటివరకూ అధికారిక ప్రకటన లేదు

ఈ ఘటనపై ఇప్పటివరకు కేన్స్ నిర్వాహకులు లేదా ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే ఘర్షణకు దారితీసిన అసలు కారణాలు, స్టైలిస్ట్‌పై నమోదయ్యే కేసుల వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

Advertisement