LOADING...
US Aircraft Carrier: పశ్చిమాసియాను వీడిన అమెరికా విమాన వాహక నౌక జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌..
పశ్చిమాసియాను వీడిన అమెరికా విమాన వాహక నౌక జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌..

US Aircraft Carrier: పశ్చిమాసియాను వీడిన అమెరికా విమాన వాహక నౌక జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌..

వ్రాసిన వారు Sirish Praharaju
May 03, 2026
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన విమాన వాహక నౌక జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌(Gerald R. Ford) యుద్ధ రంగం నుంచి వెనక్కి వెళ్లింది. ఇరాన్‌తో జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా సముద్ర జలాల్లో మోహరించిన ఈ నౌక తాజాగా అక్కడి నుంచి తిరిగి ప్రయాణం ప్రారంభించినట్లు సమాచారం. మే రెండో వారానికి ఇది అమెరికా చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు ముగిసినట్లుగా అమెరికా అధ్యక్ష కార్యాలయం సంకేతాలు ఇవ్వడం మధ్య ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అమెరికాకు చెందిన మరో రెండు విమాన వాహక నౌకలు యూఎస్ఎస్ అబ్రహం లింకన్, యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ అక్కడే మోహరించి ఉన్నాయి.

వివరాలు 

సముద్ర జలాల్లో మోహరించి ఉన్న విమాన వాహక నౌకగా రికార్డు

ప్రస్తుతం జెరాల్డ్‌ ఎర్ర సముద్రం వైపు కదులుతుండగా,మిగతా రెండు నౌకలు అరేబియా సముద్రంలో తమ స్థావరాలను కొనసాగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో అమెరికా వెనెజువెలాపై దాడి జరిపి, అధ్యక్షుడు Nicolás Maduroను అదుపులోకి తీసుకున్న సందర్భంలో కూడా జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ నౌక నుంచి బయలుదేరిన యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. అనంతరం ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరగడంతో ఈ నౌకను పశ్చిమాసియాకు తరలించారు. దాదాపు పది నెలలకు పైగా సముద్రంలోనే కొనసాగుతూ, అత్యధిక కాలం మోహరించిన విమాన వాహక నౌకగా ఇది ప్రత్యేక రికార్డు సృష్టించింది. మధ్యలో ఒకసారి అగ్ని ప్రమాదం సంభవించడంతో మరమ్మతుల కోసం Greeceకు పంపించారు. తర్వాత Croatiaలో కొంతకాలం విశ్రాంతి కల్పించి, ఏప్రిల్‌లో తిరిగి పశ్చిమాసియా ప్రాంతానికి మళ్లించారు.

వివరాలు 

ఇరాన్‌-రష్యా చర్చలు

అమెరికాతో శాంతి చర్చల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ(Seyed Abbas Araghchi), రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌(Sergey Lavrov)తో ఫోన్ ద్వారా మాట్లాడారు. పశ్చిమాసియా జలాల్లో నౌకాయాన స్వేచ్ఛ, ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలు, మధ్యప్రాచ్య ప్రాంతంలో సైనిక-రాజకీయ స్థిరత్వం వంటి కీలక విషయాలపై ఇరువురు చర్చించినట్లు రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది. హర్మూజ్‌ జలసంధి గుండా రష్యా నౌకల రాకపోకల అంశం కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

Advertisement