Page Loader
USA: అక్రమ వలసదారుల నిర్బంధ బిల్లుకు ఆమోదం తెలిపిన యుఎస్ కాంగ్రెస్ 
అక్రమ వలసదారుల నిర్బంధ బిల్లుకు ఆమోదం తెలిపిన యుఎస్ కాంగ్రెస్

USA: అక్రమ వలసదారుల నిర్బంధ బిల్లుకు ఆమోదం తెలిపిన యుఎస్ కాంగ్రెస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2025
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ వలసలను అరికట్టే దిశగా కీలకమైన అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల బహిష్కరణకు సంబంధించి రూపొందించిన కీలక బిల్లుకు కాంగ్రెస్‌ తాజాగా ఆమోదం తెలిపింది. అధ్యక్షుడిగా ట్రంప్‌ సంతకం చేసే మొదటి బిల్లు ఇదే కావచ్చని అంచనా వేస్తున్నారు. తీవ్ర నేరాలపై ప్రత్యేక దృష్టి దొంగతనాలు,తీవ్ర నేరాలకు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవడానికి రూపొందించిన ఈ బిల్లుకు బుధవారం ఆమోదం లభించింది. "గత మూడు దశాబ్దాల్లో ఇది అత్యంత ముఖ్యమైన ఇమ్మిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బిల్లుగా నిలుస్తుంది" అని అలబామా రిపబ్లికన్‌ సెనేటర్‌ కేటీ బ్రిట్‌ వ్యాఖ్యానించారు. అయితే, బిల్లును అమలు చేయడానికి ప్రస్తుతం ఉన్న నిధులు సరిపోవని ఫెడరల్‌ అధికారులు హెచ్చరించారు.

వివరాలు 

మెక్సికో సరిహద్దుల్లో శిబిరాలు ఏర్పాటు 

దీని వల్ల అమలులో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్‌ "అక్రమ వలసదారులను బయటకు పంపిస్తా" అనే హెచ్చరికల నేపథ్యంలో, మెక్సికో తమ సరిహద్దు ప్రాంతాల్లో శరణార్థ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. టెక్సాస్‌ సరిహద్దు ప్రాంతంలో ఖాళీ స్థలాన్ని ఉపయోగించి పెద్ద ఎత్తున ఈ శిబిరాలను నిర్మిస్తోంది. "ఈ శిబిరాలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. వలసదారుల సంఖ్య పెరిగితే వాటిని మరింత విస్తరిస్తాం" అని మెక్సికో అధికారులు తెలిపారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చి అమెరికా బహిష్కరణకు గురైన వారిని మెక్సికన్‌ నగరాలకు పంపాలని వారు సూచించారు.

వివరాలు 

పెంటగాన్‌ చర్యలు 

దక్షిణ సరిహద్దు నిఘా కోసం పెంటగాన్‌ 1,500 క్రియాశీలక బలగాలను మోహరిస్తుందని తెలిపింది. ఇప్పటికే నిర్బంధంలో ఉన్న 5,000 మందికి పైగా వలసదారులను దేశం నుంచి పంపించేందుకు హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌కు మద్దతు ఇస్తామని పేర్కొంది. అక్రమ వలసదారుల బహిష్కరణ కోసం సైనిక విమానాలను పంపిస్తామని తాత్కాలిక రక్షణ కార్యదర్శి రాబర్ట్‌ సాలెస్సెస్ ప్రకటించారు.