H-1B Visa: 'చెన్నైలో హెచ్-1బీ వీసా భారీ కుంభకోణం'.. అమెరికా ప్రజాప్రతినిధి సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ప్రొఫెషనల్స్‌ను అమెరికా కంపెనీలు నియమించుకునేందుకు ఉపయోగించే హెచ్-1బీ (H-1B) వీసా వ్యవస్థపై గత కొద్ది రోజులుగా భారీ చర్చ నడుస్తోంది. ఈ వీసాలు దుర్వినియోగానికి గురవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. ఇదే సమయంలో భారతీయ-అమెరికన్ దౌత్యవేత్త మహవష్ సిద్ధిఖీ (Mahvash Siddiqui) చేసిన వ్యాఖ్యలు కొత్త సంచలనానికి దారితీశాయి. భారతీయులు (Indians) నకిలీ విద్యాసర్టిఫికెట్లు, రాజకీయ ఆశ్రయం ఉపయోగించి ఈ వీసాలు పొందుతున్నారన్నది ఆమె ఆరోపించారు.
వివరాలు
తప్పుడు డిగ్రీలు, నకిలీ పత్రాలు
2005-07 మధ్య చెన్నైలోని అమెరికా కాన్సులేట్‌లో దౌత్యవేత్తగా పనిచేసిన ఆమె, ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని పలు ముఖ్యాంశాలను ప్రస్తావించారు. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ రంగాల్లో ఇప్పటికీ నిపుణుల కొరత ఉందని అంగీకరించిన ఆమె, ఆ లోటును భారత్ నుంచి వచ్చే వారు పూరించాల్సి వస్తోందని చెప్పారు. అయితే, భారతీయులకు జారీ చేసిన హెచ్-1బీ వీసాల్లో 80-90 శాతం నకిలీవని, ఈ వీసాలు పొందేందుకు వారు తప్పుడు డిగ్రీలు, నకిలీ పత్రాలు సమర్పించారని ఆమె ఆరోపించారు. హెచ్-1బీ వీసాలకు అవసరమైన ప్రామాణిక నైపుణ్యం చాలామందిలో లేదని కూడా ఆమె పేర్కొన్నారు.
వివరాలు
దర్యాప్తు జరపకుండా తమపై ఒత్తిడి
చెన్నైలో పని చేసిన సమయంలో ఈ అక్రమాలు గమనించిన తాము, దానిపై విదేశాంగ కార్యదర్శిని అప్రమత్తం చేశామని చెప్పిన సిద్ధిఖీ, కానీ రాజకీయ ఒత్తిళ్లవల్ల ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అనేక రాజకీయ నేతల ప్రమేయం ఉందని, దర్యాప్తు జరపకుండా తమపై ఒత్తిడి తెచ్చారని వివరించారు. భారత నాయకులను సంతృప్తి పరచడానికే ఈ రకమైన వీసా మోసాలు జరిగాయని ఆమె వ్యాఖ్యానించారు.
వివరాలు
లంచాల ద్వారా ఉద్యోగాలు
తాను చెన్నై కాన్సులేట్‌లో ఉన్న సమయంలో 51,000కు పైగా వలసేతర వీసాలు జారీ చేశామని, వాటిలో పెద్ద భాగం హెచ్-1బీ వీసాలేనని ఆమె తెలిపారు. హైదరాబాద్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చే దరఖాస్తులన్నీ ఈ కాన్సులేట్ పరిధిలో ఉన్నాయని, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చిన దరఖాస్తుల విషయంలో ఆందోళన కలిగే పరిస్థితులు ఎదురయ్యాయని ఆమె వెల్లడించారు. భారత్‌లో మోసం, లంచాలు సాధారణంగా మారాయని, ఒక భారతీయ-అమెరికన్‌గా ఇవి చెప్పడం తనకే బాధకరమని అన్నారు. అమెరికన్ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తే అభ్యర్థులు హాజరుకాకపోవడం, అదే భారతీయ అధికారులు ఇంటర్వ్యూ చేస్తే లంచాల ద్వారా ఉద్యోగాలు పొందడం వంటి విషయాలు కూడా ఆమె బయటపెట్టారు.
వివరాలు
చెన్నై నుంచే 2 లక్షలకు పైగా హెచ్-1బీ వీసాలా..?
హెచ్-1బీ వీసా కార్యక్రమంలో జరుగుతున్న అక్రమాల గురించి అమెరికా మాజీ ప్రతినిధి, ఆర్థిక నిపుణుడు డాక్టర్ డేవ్ బ్రాట్ (Dr. Dave Brat) కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని చెన్నై నగరంనుంచి 2 లక్షలకు పైగా హెచ్-1బీ వీసాలు జారీ కావడం పట్ల ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, వీసా కేటాయింపుల విషయంలో భారత్ చట్టబద్ధ పరిమితులను మించిపోయిందని పేర్కొన్నారు.
వివరాలు
ఇక్కడ ఏదో పెద్ద మోసం జరుగుతోందని సందేహం: డేవ్ బ్రాట్
"అమెరికాకు హెచ్-1బీ ఆధారంగా వచ్చే వారి లో 71 శాతం మంది భారతీయులు, చైనా నుంచి మాత్రం 12 శాతం మాత్రమే. కానీ భారత్ కోసం నిర్ణయించిన హెచ్-1బీ వార్షిక పరిమితి కేవలం 85,000. అలాంటప్పుడు చెన్నై నుంచి ఒక్కదానికే 2,20,000 వీసాలు ఎలా వచ్చాయి? ఇది కాంగ్రెస్ నిర్ణయించిన పరిమితికి దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. ఇక్కడ ఏదో పెద్ద మోసం జరుగుతోందని సందేహం కలుగుతోంది" అని ఆయన వ్యాఖ్యానించారు.