US-Iran War: అమెరికా వైమానిక దాడులతో ఉత్తర ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. పలు ప్రావిన్సులు లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలను మరింత వేగవంతం చేసింది. ఇప్పటివరకు ప్రధానంగా దక్షిణ ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకున్న అమెరికా.. ఇప్పుడు ఉత్తర ప్రాంతాలపైనా దాడులు ప్రారంభించింది. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్ పరిసర ప్రాంతాలపై క్షిపణులతో దాడులు జరిపినట్లు సమాచారం. గురువారం జరిగిన వైమానిక దాడుల్లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల తయారీ, అంతరిక్ష కార్యక్రమాలకు కీలక కేంద్రంగా భావించే సెమ్నాన్ ప్రావిన్స్‌తో పాటు హమెదాన్, హర్మోజ్‌గన్, ఖుజెస్థాన్, లోరెస్థాన్, మర్కజీ, సిస్టాన్-బలోచిస్థాన్ ప్రావిన్సులు అమెరికా లక్ష్యంగా మారాయి. ఇరాన్‌తో తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత మళ్లీ ప్రారంభమైన దాడుల్లో టెహ్రాన్ చుట్టుపక్కల ప్రాంతాలపై అమెరికా దాడులు జరపడం ఇదే తొలిసారి.
వివరాలు
చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి
అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా చర్యలకు దిగింది.
పశ్చిమాసియాలో అమెరికా మిత్రదేశాలైన బహ్రెయిన్, జోర్డాన్, కువైట్‌లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు నిర్వహించినట్లు వెల్లడైంది.
ఇక హర్మూజ్ జలసంధిలో తమ నౌకాదళం విధించిన దిగ్బంధాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణతో కురసావో జెండాతో ప్రయాణిస్తున్న బెల్మా అనే చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి చేసి నిర్వీర్యం చేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది.
వివరాలు
శాంతి ఒప్పందానికి ఇంకా అవకాశం ఉందన్న ట్రంప్
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
టెహ్రాన్ కూడా అలాంటి ఒప్పందాన్ని కోరుకుంటోందని ఆయన తెలిపారు.గూఢచర్యం ఆరోపణలతో 2024 నుంచి నిర్బంధంలో ఉన్న అమెరికా పౌరుడు డేనా కరారీని ఇరాన్ ఇటీవల విడుదల చేయడం సానుకూల చర్యగా ట్రంప్ అభివర్ణించారు.
అయితే ఇరాన్‌లోని వంతెనలు,విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని ట్రంప్ పలుమార్లు హెచ్చరికలు జారీ చేయడంతో టెహ్రాన్ సంయుక్త మిలిటరీ కమాండ్ తీవ్రంగా స్పందించింది.
అలాంటి దాడులు జరిగితే ప్రతీకారంగా అరబ్ దేశాలపై తీవ్రచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అమెరికా తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని మూసివేసే దిశగా చర్యలు తీసుకోవాలని యెమెన్‌లోని హూతీతిరుగుబాటుదారులకు ఇరాన్ సూచించినట్లు సమాచారం.
వివరాలు
హర్మూజ్ మార్గంలో భారతీయ నావికుల నియామకంపై కేంద్ర ఆదేశాలు
హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతుండటం, భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే వాణిజ్య నౌకల్లో భారతీయులను నియమించవద్దని నౌక యజమానులకు ఆదేశాలు జారీ చేసింది.
గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (డీజీఎంఏ) వెల్లడించింది.