LOADING...
US Flight: 44 సెకన్లలో 4,300 అడుగుల ఎత్తుకు పడిపోయిన అమెరికా విమానం! ఇద్దరు ప్రయాణికులు..
44 సెకన్లలో 4,300 అడుగుల ఎత్తుకు పడిపోయిన అమెరికా విమానం! ఇద్దరు ప్రయాణికులు..

US Flight: 44 సెకన్లలో 4,300 అడుగుల ఎత్తుకు పడిపోయిన అమెరికా విమానం! ఇద్దరు ప్రయాణికులు..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2025
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

హూస్టన్‌ వైపు బయలుదేరిన యునైటెడ్ ఎక్స్‌ప్రెస్‌ (స్కైవెస్ట్‌ నిర్వహిస్తున్న) విమానంలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనలో విమానం కేవలం 44 సెకన్ల వ్యవధిలోనే 4,350 అడుగుల ఎత్తుకు ఒక్కసారిగా పడిపోయింది. కొలరాడోలోని ఆస్పెన్‌ నుంచి టేకాఫ్‌ అయిన స్కైవెస్ట్‌ 5971 నంబర్‌ విమానం ఈ తీవ్ర కుదుపుకు గురైంది. ఆ తర్వాత, పరిస్థితి దృష్ట్యా, విమానాన్ని టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ అది స్థానిక సమయం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. తీవ్ర కుదుపుల కారణంగా విమానం ఒక్కసారిగా తక్కువ ఎత్తుకు దూసుకెళ్లడంతో ప్రయాణికులలో ఇద్దరికి గాయాలయ్యాయి. అత్యవసర ల్యాండింగ్‌ అనంతరం వారికి తక్షణ వైద్యసహాయం అందించారు.

వివరాలు 

విమానం 39,000అడుగుల ఎత్తు నుండి 34,650 అడుగుల వరకు పడిపోయింది

ప్రయాణికులందరి భద్రత,శ్రేయస్సే మా ప్రధాన ప్రాధాన్యత అని,కస్టమర్లకు సహాయం చేసేందుకు యునైటెడ్‌తో కలిసి పనిచేస్తున్నామని ఎయిర్‌లైన్‌ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫ్లైట్‌ మార్గం ప్రకారం విమానం ఫోర్ట్‌ వర్త్‌ ప్రాంతం సమీపంలో 39000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా (సుమారు 00:27 UTC సమయం-అంటే టేకాఫ్‌ అయిన 90నిమిషాల తర్వాత) ఒక్కసారిగా తీవ్రమైన అల్లకల్లోలాన్ని ఎదుర్కొంది. Flightradar24రికార్డుల ప్రకారం,00:27:06 నుంచి 00:27:50 వరకు(అంటే కేవలం 44సెకన్లలోనే) విమానం 39,000అడుగుల ఎత్తు నుండి 34,650 అడుగుల వరకు పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ 00:28:50 సమయానికి 37450అడుగుల ఎత్తుకు చేరుకుంది.అనంతరం,విమానం ఆస్టిన్‌ వైపు ల్యాండింగ్‌ కోసం దిగడం ప్రారంభించింది. అలాగే 00:30:57 UTCకి 7700 స్క్వాక్‌ కోడ్‌(సాధారణ అత్యవసర పరిస్థితిని సూచించే సంకేతం) పంపింది.

వివరాలు 

ఎందుకు అలా అయింది? 

వాతావరణ మార్పుల కారణంగా గాలి అస్థిరంగా మారి, విమానం ఆ గాలి ప్రవాహంలో పడింది. అప్పుడు విమానం పైకి, కిందికి అనియంత్రితంగా కదలికలు జరిపింది. ఈ తరహా కదలికల వల్ల శరీరంపై 1.5G కంటే ఎక్కువ ఒత్తిడి ఏర్పడితే దానిని తీవ్రమైన అల్లకల్లోలంగా పరిగణిస్తారు. అలాంటి సందర్భంలో సీటు బెల్ట్‌ ధరించకపోతే ప్రయాణికులు సీటు నుండి కిందపడిపోవడం లేదా గాయపడే ప్రమాదం ఎక్కువ. ఈ ఘటనలోనూ అదే పరిస్థితి చోటుచేసుకుంది.