కరోనా మూలాల గుట్టు విప్పే కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం; బైడెన్ వద్దకు ఫైల్
పదిలక్షల కంటే ఎక్కువ మంది అమెరికన్లను పొట్టనపెట్టున్న కరోనా వైరస్ మూలాలను తెలుసుకునే కీలక బిల్లును అమెరికా కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఆమోదించింది. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ నుంచే కరోనా పుట్టిందని పలు అమెరికా ఏజెన్సీలు తేల్చి చెప్పాయి. అయితే ఏజెన్సీల నివేదికల్లో నిజమెంత? నిజంగా వుహాన్ ల్యాబ్‌కు-కరోనాకు సంబంధం ఉందా? అది ఎక్కడ పుట్టింది? వ్యాప్తి ఎలా జరిగింది? వైరస్ ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఏమి చేయవచ్చు? అనే ప్రశ్నలకు అమెరికా ప్రజలు సమాధానాలను కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కరోనా మూలాలకు సంబంధించి అన్ని అంశాలను వర్గీకరించి, దేశ ప్రజలకు పారదర్శకమైన సమాచారాన్ని ఇచ్చేందుకు అమెరికా కాంగ్రెస్ ఈ బిల్లును తీసుకొచ్చింది.
బిల్లుపై ఇంకా నిర్ణయం తీసుకోని అద్యక్షుడు బైడెన్
కరోనా వైరస్ మూలాలను వర్గీకరించే బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో 419-0 తేడాతో ఆమోదం పొందినట్లు వైట్‌హౌస్ తెలిపింది. అనంతరం ఆ బిల్లును బైడెన్ వద్దకు పంపింది. వైరస్ ప్రబలి మూడేళ్లు కావొస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బిల్లుపై అధ్యక్షుడు బైడెన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ బిల్లుపై బైడెన్ సంతకం చేస్తారా? లేదా? అనేది అనుమానంగా ఉంది. కరోనాకు సబంధించిన ప్రతి అంశంపై అమెరికన్ ప్రజలకు సమాధానాలు కావాలని హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ ప్రతినిధి మైఖేల్ టర్నర్ అన్నారు. కాంగ్రెస్‌లో చర్చ సందర్భంగా టాప్ డెమొక్రాట్ అయిన కనెక్టికట్‌కు చెందిన జిమ్ హిమ్స్ మాట్లాడుతూ.. పారదర్శకత అనేది మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అన్నారు.