Green Card: అమెరికాలో 7 ఏళ్లు ఉంటే గ్రీన్‌కార్డ్‌కు అవకాశం.. కొత్త బిల్లు ప్రతిపాదన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో గ్రీన్‌కార్డ్, హెచ్-1బీ వీసా విధానాలపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు వేర్వేరు ప్రతిపాదనలతో ముందుకు వస్తుండగా, తాజాగా డెమోక్రటిక్ సెనెటర్ అలెక్స్ పాడిల్లా దీర్ఘకాలంగా అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు ఊరటనిచ్చే బిల్లును ప్రస్తావించారు. హెచ్-1బీ వీసాదారులు సహా అమెరికాలో వరుసగా ఏడు సంవత్సరాలు నివసించిన వారికి గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన సూచించారు. ఇటీవల రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనెటర్ టిమ్ షీహీ, హెచ్-1బీ వీసాల జారీని మూడు సంవత్సరాల పాటు నిలిపివేయాలని కోరుతూ సెనెట్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి భిన్నంగా అలెక్స్ పాడిల్లా తీసుకొచ్చిన ప్రతిపాదనలు వలసదారులకు శాశ్వత నివాస అవకాశాలను విస్తరించే దిశగా ఉన్నాయి.
వివరాలు
బిల్లులో పలు కీలక మార్పులు
గత ఏడాది పాడిల్లా ప్రవేశపెట్టిన 'ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1929లో వలస నిబంధనల పునరుద్ధరణ' బిల్లులో పలు కీలక మార్పులను ప్రతిపాదించారు.
వలసదారులపై అమలు చేస్తున్న కఠిన విధానాలకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ బిల్లు ప్రకారం, అమెరికాలో కనీసం ఏడు సంవత్సరాలుగా నివసిస్తున్న వారు శాశ్వత నివాస హోదా (గ్రీన్‌కార్డ్) కోసం దరఖాస్తు చేసుకునే అర్హత పొందుతారు.
అయితే, వారి పేరుపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదనే నిబంధన తప్పనిసరిగా ఉండాలని బిల్లులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అలెక్స్ పాడిల్లా మాట్లాడుతూ, కష్టపడి పనిచేస్తూ అమెరికా అభివృద్ధిలో భాగస్వాములవుతున్న వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరికి వ్యతిరేకంగానే తాను ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
వివరాలు
న్యాయబద్ధమైన అవకాశాలను కల్పించాల్సిన సమయం
వలసదారులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న వ్యాఖ్యలు, విధానాలు ఇప్పటికే అక్కడ తమ జీవితాలను స్థిరపరచుకున్న అనేక కుటుంబాలను అనిశ్చితిలోకి నెడుతున్నాయని ఆయన అన్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు గణనీయంగా తోడ్పడుతున్న లక్షలాది మంది దీర్ఘకాలిక నివాసితులను కాంగ్రెస్ విస్మరించకూడదని పాడిల్లా అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత వలస చట్టాలను సవరించి, శాశ్వత నివాస హోదా పొందేందుకు న్యాయబద్ధమైన అవకాశాలను కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు.