LOADING...
Strait Of Malacca: హార్ముజ్ తర్వాత మలక్కా జలసంధిపై అమెరికా గురి .. భారతదేశానికి ఇది ఎందుకు కీలకం?
భారతదేశానికి ఇది ఎందుకు కీలకం?

Strait Of Malacca: హార్ముజ్ తర్వాత మలక్కా జలసంధిపై అమెరికా గురి .. భారతదేశానికి ఇది ఎందుకు కీలకం?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2026
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా, మరో కీలక సముద్ర మార్గమైన మలాకా జలసంధిపై కూడా తన ప్రభావాన్ని పెంచుకోవాలని కసరత్తు చేస్తోంది. ఈ లక్ష్యంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండోనేషియాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అమెరికా, ఇండోనేసియా రక్షణ మంత్రులు రహస్యంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మలాకా జలసంధి ఇండోనేసియా, మలేసియా, సింగపూర్ దేశాల మధ్యగా సాగుతూ భారత్‌కు కూడా సమీపంగా ఉంటుంది. ఇటీవల ఈ రెండు దేశాల మధ్య కీలక రక్షణ సహకార ఒప్పందం కుదిరింది. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు నలభై శాతం ఈ మార్గం మీదుగానే జరుగుతోంది.

వివరాలు 

ఆసియా వాణిజ్య మార్గాలపై అమెరికా ప్రభావం

హర్మూజ్ జలసంధి ద్వారా ప్రధానంగా చమురు, ఎరువుల రవాణా జరుగుతుండగా, మలాకా మార్గంలో చమురు దిగుమతులతో పాటు దిగుమతులతోపాటు కార్లు, సెమీకండక్టర్లు, యంత్ర సామగ్రి తదితర వస్తువులన్నీ రవాణా అవుతున్నాయి. చైనా, జపాన్ దేశాల వాణిజ్యానికి ఈ మార్గం అత్యంత కీలకం. హర్మూజ్, మలాకా జలసంధులపై ఆధిపత్యం సాధిస్తే ఆసియా వాణిజ్య మార్గాలపై అమెరికా ప్రభావం పెరుగుతుంది. ముఖ్యంగా మలాకా జలసంధి చైనాకు అత్యంత ప్రాధాన్యం కలిగినదిగా భావించబడుతుంది. అందువల్ల అక్కడ అమెరికా ప్రభావాన్నిచైనా సహించకపోవచ్చు. ఇటీవల చైనా పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో, మలాకా సమీప ప్రాంతాల్లో సముద్ర పరిశీలన చర్యలు వేగవంతం చేసింది.

వివరాలు 

సింగపూర్ అంశం

అమెరికా లక్ష్యాలు సులభంగా నెరవేరే పరిస్థితి లేదు. మలాకా జలసంధిలో సముద్ర సరిహద్దులు, చిన్న దీవుల నియంత్రణ విషయంలో ఇండోనేసియా, సింగపూర్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అమెరికాకు మిత్రదేశమైన సింగపూర్ ఈ జలసంధి ద్వారా జరిగే వాణిజ్యంలో ప్రధాన లాభాలను పొందుతోంది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకలపై సుంకాలు విధించడం చూసిన సింగపూర్, అదే విధంగా ఇండోనేసియా, మలేసియా కూడా మలాకా మార్గంలో పన్నులు విధించే అవకాశంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Advertisement

వివరాలు 

భారత్‌కూ కీలకమే

భారతదేశ వాణిజ్యంలో దాదాపు 55శాతం మలాకాజలసంధి మీదుగానే జరుగుతోంది. ఈ జలసంధి ప్రారంభ ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులకు చాలా సమీపంలో ఉండటం చైనాకు ఆందోళన కలిగిస్తోంది. పోర్ట్ బ్లెయిర్ నుంచి ఈ మార్గాన్ని చేరుకోవడానికి ఇరవై నాలుగు గంటల లోపే సమయం పడుతుంది. హిందూమహాసముద్ర ప్రాంతంలో చైనాకు ప్రతిస్పందనగా భారత్‌ను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో గత అమెరికా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అందువల్ల ఈప్రాంతంలో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్ సహకారం కీలకం. అండమాన్,నికోబార్ దీవుల్లో భారత్ సైనిక,నౌకా స్థావరాలను కొనసాగిస్తోంది. గతంలో మలాకాజలసంధి గస్తీ కార్యక్రమాల్లో భారత్‌ను చేర్చుకోవడానికి సింగపూర్ ముందుకు వచ్చింది. భవిష్యత్తులో అమెరికా చర్యలు చేపడితే,ఆ ప్రణాళికల్లో భారత్ కేంద్ర పాత్ర పోషించే అవకాశం ఉంది.

Advertisement