Loading...
Us Midterm Elections 2026: ట్రంప్ పార్టీ ఓటమి.. భారత్‌కు లాభమా? వీసా ఆంక్షలు సడలుతాయా?
ట్రంప్ పార్టీ ఓటమి.. భారత్‌కు లాభమా? వీసా ఆంక్షలు సడలుతాయా?

Us Midterm Elections 2026: ట్రంప్ పార్టీ ఓటమి.. భారత్‌కు లాభమా? వీసా ఆంక్షలు సడలుతాయా?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష డెమొక్రాట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సెనేట్‌తోపాటు ప్రతినిధుల సభలోనూ మెజార్టీ సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు ముందు రిపబ్లికన్ పార్టీకి ఓటేస్తే ప్రతి ఓటరుకు 5 వేల డాలర్లు ఇస్తానని అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చినా.. ఆ పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం మెజార్టీ సాధిస్తే ట్రంప్ అధికారాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? దేశీయంగా ఎదురయ్యే రాజకీయ ఒత్తిడిని ఆయన విదేశీ వ్యవహారాలపై చూపిస్తారా? భారత్‌కు ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా వీసా ఆంక్షలు సడలే అవకాశం ఉందా? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.

వివరాలు 

అమెరికా మధ్యంతర ఎన్నికల విధానం ఇదే..

అమెరికా రాజకీయ వ్యవస్థలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌ను మన లోక్‌సభతో, సెనేట్‌ను రాజ్యసభతో పోల్చవచ్చు.

అమెరికా అధ్యక్షుడి పదవీకాలం నాలుగేళ్లు. అధ్యక్షుడి పదవీకాలంలో సగం పూర్తయ్యే సమయంలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి.

ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. సెనేట్‌లోని మూడోవంతు స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతాయి.

అమెరికాలోని ప్రతి రాష్ట్రానికి సెనేట్‌లో రెండు స్థానాలు కేటాయించారు.

వివరాలు 

ప్రతిపక్షం చేతికి పగ్గాలు.. ట్రంప్ అధికారాలకు అడ్డుకట్ట

మధ్యంతర ఎన్నికల్లో సెనేట్‌లో మెజార్టీ సాధించిన డెమొక్రాట్లు.. ప్రతినిధుల సభలోనూ ఆధిక్యం దిశగా సాగుతున్నారు.

అధికార పార్టీ మెజార్టీ కోల్పోయినంత మాత్రాన అధ్యక్షుడు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.

అయితే, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

కొత్త చట్టాలు చేయాలన్నా, బడ్జెట్‌కు ఆమోదం పొందాలన్నా సభలో మెజార్టీ అవసరం. ప్రతిపక్షానికి మెజార్టీ లభిస్తే ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది.

కొత్త చట్టాలు ఆమోదం పొందకపోతే.. పాలన కొనసాగించేందుకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆధారపడాల్సి వస్తుంది.

ADVERTISEMENT

వివరాలు 

దేశీయంగా ఒత్తిడి.. విదేశాల్లో దూకుడు?

మధ్యంతర ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోయి, సెనేట్‌తోపాటు ప్రతినిధుల సభలోనూ ప్రతిపక్షం ఆధిక్యం సాధిస్తే.. అమెరికా అంతర్గత వ్యవహారాల్లో అధ్యక్షుడికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.

కీలక నిర్ణయాల విషయంలో కాంగ్రెస్ నుంచి అడ్డంకులు ఎదురుకావచ్చు.

దీంతో దేశీయంగా ఎదురయ్యే ఒత్తిడిని విదేశాంగ విధానంలో దూకుడు ప్రదర్శించడం ద్వారా అధిగమించేందుకు ట్రంప్ ప్రయత్నించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కేవలం ట్రంప్ వ్యక్తిగత స్వభావాన్ని బట్టి చేస్తున్న అంచనా మాత్రమే కాదు. గతంలో మధ్యంతర ఎన్నికల్లో ఓటమిపాలైన అమెరికా అధ్యక్షులు కూడా ఇలాంటి వైఖరిని అనుసరించిన సందర్భాలు ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

దేశీయంగా ఒత్తిడి.. విదేశాల్లో దూకుడు?

సైనిక చర్యలు, దాడులు, వ్యూహాత్మక మోహరింపుల విషయంలో అమెరికా అధ్యక్షుడికి విస్తృత అధికారాలు ఉంటాయి.

కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు, అధ్యక్ష స్థాయి ఒప్పందాల ద్వారా విదేశాంగ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది.

దేశీయంగా కీలక బిల్లులకు ప్రతిపక్షం అడ్డుపడితే పాలన స్తంభించినట్లు కనిపిస్తుంది.

అలాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టి అంతర్గత సమస్యలపై పడకుండా ఉండేందుకు, తనను తాను సమర్థుడైన నాయకుడిగా నిరూపించుకునేందుకు అధ్యక్షులు విదేశీ సంక్షోభాల్లో జోక్యం చేసుకున్న సందర్భాలున్నాయి.

1994 మధ్యంతర ఎన్నికల్లో ఓటమి తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ బోస్నియా, కొసావో సంక్షోభాలపై దృష్టి సారించారు.

వివరాలు 

ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతుందా?

ఇప్పటికే ఇరాన్‌తో యుద్ధంలో ఉన్న అమెరికా.. ఆ పరిస్థితి నుంచి వెంటనే బయటపడలేని స్థితిలో ఉంది.

మధ్యంతర ఎన్నికల్లో ఓటమి ఎదురైతే ఇరాన్‌ను అణచివేయడానికి ట్రంప్ మరింత తీవ్రంగా దాడులు చేసే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేం.

అయితే, యుద్ధాన్ని కొనసాగించేందుకు అవసరమైన నిధులను కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది.

ప్రతిపక్షానికి మెజార్టీ ఉన్న కాంగ్రెస్.. అధ్యక్షుడు కోరిన మేరకు యుద్ధ వ్యయాలకు నిధులు విడుదల చేయకపోవచ్చు.

అదే జరిగితే అమెరికా సైనిక చర్యలను కొనసాగించడం కష్టమవుతుంది. ఇరాన్‌తో యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందా? లేక నిలిచిపోతుందా? అనేది ట్రంప్ నిర్ణయాలతోపాటు ఇరాన్ అనుసరించే వైఖరిపైనా ఆధారపడి ఉంటుంది.

వివరాలు 

భారత్‌పై ప్రభావం ఎలా ఉండొచ్చు?

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా పూర్తికాలేదు. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి ప్రభావంతో ఈ ఒప్పందంపై భారత్‌తో అమెరికా బేరసారాలు గతంలో మాదిరిగా ఉండకపోవచ్చు.

అయితే, ఒప్పందాన్ని సమీక్షించాలని డెమొక్రాట్లు భావిస్తే.. దాని అమలుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

ఈ క్రమంలో భారత్‌కు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురుకావచ్చు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత వలసల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నారు.

దీంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోతే ట్రంప్ ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెరుగుతుంది.

వివరాలు 

భారత్‌పై ప్రభావం ఎలా ఉండొచ్చు?

ఈ నేపథ్యంలో ఉభయ సభలు, న్యాయస్థానాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమల్లో ఉన్న వీసా ఆంక్షలను సడలించే ప్రయత్నాలు చేయవచ్చు.

అలా జరిగితే భారత ఐటీ ఉద్యోగులు, ఐటీ సంస్థలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

వీసాల విషయంలో వెసులుబాటు లభిస్తే అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయులకు కొంత ఊరట లభించవచ్చు.

అయితే వాణిజ్య సుంకాల విషయంలో ట్రంప్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం.

ఎందుకంటే ఇతర దేశాలపై వాణిజ్య సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడి పరిధిలో ఉంటుంది.

దేశీయంగా పన్నుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతిపక్షం అడ్డుపడినా.. ఇతర దేశాలపై సుంకాలు పెంచడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో తన దూకుడును కొనసాగించే అవకాశం ఉంది.

వివరాలు 

భారత్‌కు సానుకూల పరిణామాలు ఉండొచ్చా?

మొత్తంగా చూస్తే.. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోతే ఇమ్మిగ్రేషన్ విషయంలో ట్రంప్ వైఖరి కొంత మెత్తబడే అవకాశం ఉంది.

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు కూడా మార్గం సుగమం కావచ్చు.

అయితే భారత్‌పై అమెరికా విధించిన వాణిజ్య సుంకాలు తక్షణమే రద్దయ్యే అవకాశాలు తక్కువగా ఉండొచ్చు.

అయినప్పటికీ భారత్ పట్ల ట్రంప్ ప్రభుత్వం కొంత సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది.

ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్, అమెరికా మధ్య దెబ్బతిన్న సంబంధాలు.. మధ్యంతర ఎన్నికల పరిణామాలతో కొంత మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి.

అయితే వీసా ఆంక్షలు, వాణిజ్య ఒప్పందం, సుంకాల విషయంలో వాస్తవంగా ఎలాంటి మార్పులు వస్తాయనేది రాబోయే పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.

ADVERTISEMENT