US Midterm Elections: నేడే అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. ట్రంప్‌కు అగ్నిపరీక్ష
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మంగళవారం జరగనున్న మధ్యంతర ఎన్నికలు కీలక పరీక్షగా మారాయి. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనెట్ స్థానాల కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి డెమోక్రాట్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సర్వేలు డెమోక్రాట్లకు అనుకూలంగా ఉండటంతో రిపబ్లికన్లు ట్రంప్ ఏదైనా అద్భుతం చేస్తారనే ఆశతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఆధిక్యం సాధిస్తే.. అధ్యక్షుడిగా ట్రంప్‌కు మిగిలిన రెండేళ్ల పాలన సవాళ్లతో నిండనుంది. అదే రిపబ్లికన్లు ఆధిక్యం నిలబెట్టుకుంటే ట్రంప్ మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కనీసం ఒక సభలోనైనా మెజారిటీ సాధించి ట్రంప్ నిర్ణయాలను అడ్డుకోవాలని డెమోక్రాట్లు భావిస్తున్నారు.
వివరాలు
ఎన్నికలు దేనికి జరుగుతున్నాయి?
అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభకు మొత్తం 435 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఆయా కాంగ్రెషనల్ జిల్లాల ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. సెనెట్‌లోని 100 స్థానాల్లో 35 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి.
అమెరికా రాజ్యాంగం ప్రకారం సెనెట్ సభ్యుల పదవీకాలం ఆరేళ్లు. ప్రతి రెండేళ్లకోసారి దాదాపు మూడో వంతు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
వీటితోపాటు పలు రాష్ట్రాల్లో గవర్నర్లు, రాష్ట్ర చట్టసభల సభ్యులను ఎన్నుకునేందుకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
వివరాలు
ట్రంప్ పదవికి ఢోకా లేకున్నా..
మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిచినా ట్రంప్ అధ్యక్ష పదవికి ఎలాంటి ముప్పు ఉండదు.
అమెరికా అధ్యక్షుడు పదవిలో కొనసాగడానికి కాంగ్రెస్‌లో మెజారిటీ అవసరం లేదు. ప్రస్తుతం ప్రతినిధుల సభ, సెనెట్ రెండింటిలోనూ రిపబ్లికన్లదే ఆధిపత్యం.
కాంగ్రెస్‌లోని రెండు సభలు జాతీయ చట్టాలను రూపొందించడంతోపాటు ప్రభుత్వ ఖర్చులకు ఆమోదం తెలుపుతాయి.
అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారాలను కూడా సమీక్షిస్తాయి. ఒక సభలో ఆమోదం పొందిన బిల్లును మరో సభ అడ్డుకోవచ్చు.
ఉదాహరణకు.. రిపబ్లికన్ల ఆధిపత్యమున్న సెనెట్ ఆమోదించిన బిల్లును డెమోక్రాట్ల ఆధిపత్యమున్న ప్రతినిధుల సభ తిరస్కరించవచ్చు. అలాగే ప్రతినిధుల సభ ఆమోదించిన బిల్లును సెనెట్ అడ్డుకోవచ్చు. రెండు సభల్లోనూ ఏ పార్టీకి ఆధిక్యం ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఇదే విధానం అమలవుతుంది.
వివరాలు
ట్రంప్ పదవికి ఢోకా లేకున్నా..
పార్లమెంటరీ కమిటీల ఏర్పాటులోనూ సభల్లో మెజారిటీ సాధించిన పార్టీకి ప్రాధాన్యం ఉంటుంది.
అయితే, ప్రత్యర్థి పార్టీ ఆమోదించిన బిల్లులను అధ్యక్షుడు ట్రంప్ వీటో చేయవచ్చు.
రెండు సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తే మాత్రం అధ్యక్షుడి వీటోను అధిగమించి బిల్లును చట్టంగా మార్చవచ్చు.
ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించిన పార్టీకి ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అధికారం ఉంటుంది.
ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై సమాచారం కోరడంతోపాటు విచారణలు నిర్వహించవచ్చు. సెనెట్‌లో ఆధిక్యం సాధించిన పార్టీకి ఫెడరల్ జడ్జిలు,సీనియర్ అధికారుల నియామకాలపై నియంత్రణ ఉంటుంది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ సెనెట్‌లో మెజారిటీ సాధిస్తే.. ఈ నియామకాలను అడ్డుకునే అవకాశం ఉంటుంది. సెనెట్‌లోని 100 మంది సభ్యుల్లో 67 మంది మద్దతు పలికితే అధ్యక్షుడిని అభిశంసించవచ్చు.
వివరాలు
ఎన్నికల్లో ప్రధానాంశాలు
అమెరికా ఓటర్లకు ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య రంగం, వలసలు, విదేశాంగ విధానం ప్రధాన సమస్యలుగా మారాయి.
ఓటర్లలో 84 శాతం మంది ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగం తమకు ముఖ్యమైన అంశమని 68 శాతం మంది తెలిపారు.
వలసలు ప్రధాన సమస్యగా 59 శాతం మంది పేర్కొనగా.. విదేశాంగ విధానానికి 57 శాతం మంది ప్రాధాన్యమిచ్చారు.
వివరాలు
సర్వేల్లో డెమోక్రాట్లకే ఆధిక్యం
అమెరికా మధ్యంతర ఎన్నికలపై నిర్వహించిన మెజారిటీ సర్వేలు డెమోక్రాట్లకు అనుకూలంగా ఉన్నాయి.
ఓటర్లలో 44 శాతం మంది డెమోక్రాట్లకు మద్దతు తెలుపుతుండగా.. 36 శాతం మంది రిపబ్లికన్లకు అనుకూలంగా ఉన్నారు.
ప్రతినిధుల సభతోపాటు సెనెట్‌లోనూ డెమోక్రాట్లు ఆధిక్యం సాధించే అవకాశాలున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
వివరాలు
భారతీయులపై ప్రభావం ఎంత?
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు అక్కడి ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపనున్నాయి.
ముఖ్యంగా భారతీయ వ్యాపారాలు, ఉద్యోగులు, వలసదారులపై ఈ ప్రభావం ఉండవచ్చు.
డెమోక్రాట్లు విజయం సాధిస్తే వీసాలు, ఇతర వలస అంశాల్లో భారతీయులకు కొంత ఉపశమనం లభించే అవకాశముంది.
ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ డెమోక్రాట్లు సమర్థించకపోవచ్చు. దీంతో ఆయన విధానాల అమలుకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది.
వివరాలు
అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు
ప్రస్తుత మధ్యంతర ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలుస్తున్నాయి.
రాజకీయ ప్రకటనల కోసం పార్టీలు ఏకంగా 11.6బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి.
ముఖ్యంగా సెనెట్ ఎన్నికల కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. టెక్సాస్ సెనెట్ ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది.
ఇక్కడ డెమోక్రాట్ జేమ్స్ టలారికో,రిపబ్లికన్ కెన్ పాక్స్‌టన్ ప్రచారాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు.
వీరి ఎన్నికల ప్రచార వ్యయం 560 మిలియన్ డాలర్లకు చేరింది.
అధ్యక్ష ఎన్నికలను మినహాయిస్తే.. ఇతర ఎన్నికలతో పోలిస్తే ఇదే అత్యధిక వ్యయం.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సహా పలువురు వ్యాపార ప్రముఖులు ఎన్నికల కోసం భారీగా విరాళాలు అందించారు. మధ్యంతర ఎన్నికల కోసం మస్క్ 446మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు.
వివరాలు
ఓడిపోతే.. 'మిస్టర్ వీటో'గా మారతా: ట్రంప్
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే తాను 'మిస్టర్ వీటో'గా మారాల్సి రావచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
డెమోక్రాట్ల అధికారాలను నియంత్రించేందుకు వీటో అధికారాన్ని వినియోగిస్తానని స్పష్టం చేశారు. ''వారు తీసుకొచ్చే బిల్లులను ఆమోదించకుండా తిరస్కరిస్తా. ఒకటి రెండు నెలలపాటు అలా చేస్తే.. చివరికి వారే నా దగ్గరకు వచ్చి ఒప్పందం చేసుకోవాలని చూస్తారు'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.