LOADING...
US navy: అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్: ఒకరి గల్లంతు

US navy: అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్: ఒకరి గల్లంతు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2026
08:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా నావికాదళానికి చెందిన యుద్ధ హెలికాప్టర్ అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నావికాదళంలో కీలకంగా ఉపయోగించే ఎంహెచ్-60ఎస్ సీహాక్ హెలికాప్టర్ బుధవారం (జులై 1) ఈ ఘటనకు గురైనట్లు అమెరికా సైనిక అధికారులు వెల్లడించారు. ఈ హెలికాప్టర్ అమెరికా యుద్ధ విమాన వాహక నౌక యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్కు అనుబంధంగా విధులు నిర్వహిస్తోంది. ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు సిబ్బంది ఉన్నారు. వారిలో ముగ్గురిని నౌకాదళానికి చెందిన రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. వారికి యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ యుద్ధనౌకపైనే అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

అరేబియా సముద్ర పరిసర ప్రాంతాల్లో అమెరికా యుద్ధనౌకలు 

అయితే, మరో సిబ్బంది మాత్రం సముద్రంలో గల్లంతయ్యారు. ఆయన ఆచూకీ కోసం అమెరికా నావికాదళానికి చెందిన యుద్ధనౌకలు, ప్రత్యేక గాలింపు విమానాలు అరేబియా సముద్రంలో విస్తృతంగా శోధన చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన యుద్ధనౌకలను అరేబియా సముద్ర పరిసర ప్రాంతాల్లో మోహరించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలో అప్రమత్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

వివరాలు 

శత్రువుల దాడి కాదు

ఈ నేపథ్యంలో జరిగిన హెలికాప్టర్ ఘటనపై యూఎస్ నేవల్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్ స్పందించింది. ఈ ప్రమాదం శత్రుదాడి లేదా ప్రత్యర్థి దేశాల కాల్పుల కారణంగా జరగలేదని ప్రాథమిక విచారణలో తేలినట్లు వెల్లడించింది. హెలికాప్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఘటనకు దారితీసిన అసలు కారణాలను గుర్తించేందుకు సమగ్ర దర్యాప్తునకు అమెరికా నావికాదళం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెరికా యుద్ధ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

Advertisement