US Navy: రాత్రివేళల్లో అమెరికా నేవీ సీల్స్ ఆపరేషన్.. హర్మూజ్‌లో సీమైన్ల క్లియరెన్స్
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిలో నౌకాయానానికి ముప్పుగా మారిన సీమైన్లను పూర్తిగా తొలగించినట్లు గత నెలలో అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే ఈ ప్రమాదకరమైన సముద్రపు మైన్లను తొలగించేందుకు అమెరికా చేపట్టిన ఆపరేషన్ వెనుక ఉన్న వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దాదాపు నాలుగు నెలలపాటు రాత్రి సమయాల్లో అమెరికా నేవీ సీల్స్ ఈ రహస్య ఆపరేషన్‌ను నిర్వహించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
వివరాలు
ఇరాన్ నియంత్రణలోకి హర్మూజ్.. నౌకా మార్గాల్లో మైన్లు
అమెరికాతో యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరిలో హర్మూజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకుంది.
ఈ క్రమంలో అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో సీమైన్లను అమర్చినట్లు తెలుస్తోంది.
ఇరాన్ సూచించిన మార్గంలో కాకుండా ఇతర మార్గాల ద్వారా ప్రయాణించిన కొన్ని నౌకలు ఈ మైన్లను ఢీకొని పేలిపోయాయి.
హర్మూజ్ సముద్ర జలాల్లో ఇరాన్ దాదాపు 80 సీమైన్లను ఏర్పాటు చేసినట్లు అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) జూన్‌లో అంచనా వేసింది.
దీంతో వాటిని గుర్తించి తొలగించేందుకు అమెరికా దళాలు రంగంలోకి దిగాయి.
వివరాలు
ఆధునిక సాంకేతికతతో మైన్ల వేట
సీమైన్లను గుర్తించేందుకు అమెరికా నేవీ అనేక అధునాతన పరికరాలను ఉపయోగించింది.
మానవరహిత నౌకలు, రోబోట్లు, సోనార్ టెక్నాలజీ, అండర్‌వాటర్ క్రాఫ్ట్‌లతో పాటు నీటి అడుగున అనుమానాస్పద వస్తువులను గుర్తించగల ప్రత్యేక యంత్రాలను రంగంలోకి దించింది.
వీటి సహాయంతో నేవీ సీల్ డైవర్లు హర్మూజ్ జలసంధిని క్షుణ్ణంగా పరిశీలించారు.
రాత్రి వేళల్లో సాగిన ఈ ఆపరేషన్ సుమారు నాలుగు నెలలపాటు కొనసాగింది.
ఈ సమయంలో ఇరాన్ అమర్చిన సీమైన్లను గుర్తించి విజయవంతంగా తొలగించినట్లు సమాచారం.
అమెరికా వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని మైన్ల వద్దకు డైవర్లు స్వయంగా వెళ్లి వాటిని నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఇంకా మైన్లు మిగిలే ఉన్నాయా?
హర్మూజ్‌లో సీమైన్లను పూర్తిగా తొలగించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అయినప్పటికీ.. జలసంధిలో ఎక్కడైనా మరికొన్ని మైన్లు మిగిలి ఉండొచ్చని షిప్పింగ్ కంపెనీలు, సముద్ర భద్రతా సలహాదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒమన్ తీర జలాల్లో ఉన్న మైన్లను అమెరికా తొలగించినట్లు తెలుస్తున్నప్పటికీ.. హర్మూజ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో ఒక్క మైన్ కూడా లేదని కచ్చితంగా చెప్పలేమని వారు పేర్కొంటున్నారు.
ఇదే సమయంలో మరో ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
అమెరికా దళాలు ఇప్పటికే మైన్లను తొలగించి సురక్షితంగా మార్చిన ప్రాంతాల్లో ఇరాన్ కొత్త సీమైన్లను మళ్లీ అమర్చి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి.
దీంతో హర్మూజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై అనిశ్చితి కొనసాగుతోంది.