Iran vs US: ఇరాన్‌పై మళ్లీ దాడులకు అమెరికా కొత్త వ్యూహం.. 'ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్'కు సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యలకు దిగాల్సి వస్తే కాంగ్రెస్ అనుమతి అవసరం లేకుండా ముందుకు సాగేందుకు అమెరికా సైన్యం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చేపట్టిన చర్యలకు భిన్నంగా కొత్త పేరుతో దాడులు కొనసాగించాలని అమెరికా భావిస్తున్నట్లు అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్' పేరును పరిశీలిస్తున్నట్లు వెల్లడైంది. గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక దాడులకు ట్రంప్ ప్రభుత్వం'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' అని పేరు పెట్టింది. ఆ తర్వాత జరిగిన తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇరాన్,అమెరికా దేశాలు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందంతో ఆ సైనిక చర్య ముగిసిందని అమెరికా ప్రభుత్వం ఇటీవల కాంగ్రెస్‌కు తెలిపింది.
వివరాలు
ఇరాన్ ఒప్పందానికి ముందుకు రాకపోతే మళ్లీ దాడులు
అయినప్పటికీ ఇరుదేశాల మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన ప్రతిపాదనలపై విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ తమతో ఒప్పందానికి ముందుకు రాకపోతే మళ్లీ దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో చర్చలు విఫలమై మరోసారి యుద్ధం ప్రారంభమైతే అది మరింత తీవ్రమైనదిగా ఉంటుందనే సంకేతం ఇచ్చేలా 'ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్' అనే పేరు పెట్టాలని అమెరికా సైన్యం యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే కాకుండా మరికొన్ని పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చిన ఇరాన్, అమెరికా
కొత్త పేరుతో సైనిక చర్య ప్రారంభిస్తే కాంగ్రెస్ అనుమతి వచ్చే వరకు మరో 60 రోజుల సమయం లభించే అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికా చట్టాల ప్రకారం యుద్ధాన్ని అధికారికంగా ప్రకటించే హక్కు కాంగ్రెస్‌కే ఉంటుంది. సాధారణంగా విదేశీ భూభాగంలో సైనిక చర్యలు ప్రారంభించిన 48 గంటల్లోపు అధ్యక్షుడు కాంగ్రెస్‌కు సమాచారం ఇవ్వాలి. అనంతరం 60 రోజుల్లోగా ఆ చర్యకు కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే ఆ గడువు పూర్తయ్యే వరకు సైనిక చర్యలను కొనసాగించే అవకాశం అధ్యక్షుడికి ఉంటుంది. ఇక గతంలో ప్రారంభించిన ఆపరేషన్‌కు సంబంధించిన 60 రోజుల గడువు పూర్తయ్యేలోపే ఇరాన్, అమెరికా దేశాలు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం.