
San Diego Plane Crash:శాన్ డియాగోలో విమానం కూలి ఆరుగురు ప్రయాణికులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
శాన్ డియాగో నగరంలో నివాస ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ఓ చిన్న విమానం హఠాత్తుగా నివాస గృహాల మధ్య కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
మరణించిన వారిలో ప్రముఖ సంగీత ఏజెంట్ డేవ్ షాపిరో కూడా ఉన్నట్టు గుర్తించారు.
ఈ విమాన ప్రమాదం నివాసాల మధ్యలోనే చోటు చేసుకోవడంతో పలు ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయి.
అలాగే పార్క్ చేసి ఉన్న కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. మరో పది మంది గాయపడినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
కాన్యన్ ప్రాంతంలో దుర్ఘటన
డేవ్ షాపిరో సౌండ్ టాలెంట్ గ్రూప్ అనే ప్రసిద్ధ సంగీత సంస్థకు సహ వ్యవస్థాపకుడు.ఆయనకు స్టోరీ ఆఫ్ ది ఇయర్, పియర్స్ ది వీల్ వంటి ప్రఖ్యాత రాక్ బ్యాండ్‌లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
అలాగే ఈ ప్రమాదంలో ప్రఖ్యాత రాక్ బ్యాండ్ మాజీ డ్రమ్స్ కళాకారుడు డేనియల్ విలియమ్స్ కూడా ప్రాణాలు కోల్పోయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విమానంలో మొత్తం ఆరుగురు ఉన్నారని,అందరూ మరణించినట్టు భావిస్తున్నట్టు ఫెడరల్ అధికారులు తెలిపారు.
ప్రమాద సమయంలో శాన్ డియాగో నగరంలోని మర్ఫీ కాన్యన్ అనే ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనపై విచారణ ప్రారంభమైందని శాన్ డియాగో అధికార ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే మృతుల పూర్తి వివరాలు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.
వివరాలు
షాపిరోకి విమానం నడపడంలో 15సంవత్సరాల అనుభవం
వెలాసిటీ ఏవియేషన్ అనే విమానయాన సంస్థ ప్రకారం,షాపిరో కేవలం సంగీత రంగంలోనే కాకుండా, అనుభవజ్ఞుడైన పైలట్ కూడా.
విమానం నడపడంలో ఆయనకు 15సంవత్సరాల అనుభవం ఉన్నట్టు సంస్థ వెల్లడించింది.
విమానయానంపై ఆయనకు మంచి ఆసక్తి ఉందని పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన విమానంలో గరిష్ఠంగా 10 మంది ప్రయాణించగలుగుతారని అధికారులు తెలిపారు.
అయితే ప్రమాద సమయంలో ఆరుగురే ఉన్నారని,అంతకుమించి ఎవ్వరూ లేరని సమాచారం.
వివరాలు
మోంట్‌గోమెరీ ఫీల్డ్ విమానాశ్రయానికి వెళ్తుండగా..
ప్రమాదం మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో జరిగిందని, విమానం ఒక్కసారిగా విద్యుత్ తీగలను తాకి నివాసాల వైపు దూసుకెళ్లిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ప్రమాదానికి ముందు విమానంలో ఉన్న వ్యక్తులు కొన్ని ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినట్టు సమాచారం.
ఈ విమానం శాన్ డియాగో డౌన్‌టౌన్‌కు ఉత్తరంగా దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోంట్‌గోమెరీ ఫీల్డ్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ విషాద సంఘటన జరిగింది.