US Naval Blockade: మళ్లీ ఓడరేవుల దిగ్బంధనం.. ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో,ఆ దేశ ప్రధాన ఓడరేవులపై మరోసారి నౌకాదళ దిగ్బంధనం(Naval Blockade)అమలు చేస్తున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ప్రాంతీయ భద్రత దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో 20కిపైగా యుద్ధనౌకలు, వందల సంఖ్యలో యుద్ధ విమానాలను మోహరించినట్లు అమెరికా తెలిపింది. అదే సమయంలో ఇరాన్‌లోని కీలక లక్ష్యాలపై అమెరికా వరుసగా నాలుగో రోజు వైమానిక దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ అధికార మీడియా కథనాల ప్రకారం.. సిరిక్, బందర్ అబ్బాస్, చాబహార్, అహ్వజ్ ప్రాంతాలతో పాటు ఖేష్మ్ ద్వీపంలోనూ పలుచోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాలు
కువైట్ నౌకపై దాడి
ఇక మరోవైపు, తమ నౌకాదళానికి చెందిన ఓ నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి జరిపిందని కువైట్ రక్షణశాఖ వెల్లడించింది.
ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడినట్లు తెలిపింది.
అదేవిధంగా, తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఒక బాలిస్టిక్ క్షిపణి, ఐదు క్రూయిజ్ క్షిపణులు, 33 డ్రోన్లను ప్రయోగించిందని పేర్కొంది.
అయితే వాటన్నింటినీ విజయవంతంగా అడ్డుకుని నిర్వీర్యం చేసినట్లు కువైట్ రక్షణశాఖ వెల్లడించింది.
వివరాలు
అమెరికాతో ఒప్పందం ముగిసింది: ఇరాన్
ఈ పరిణామాల మధ్య ఇరాన్ విదేశాంగశాఖ సహాయ మంత్రి కాజెమ్ గరిబాబాది కీలక వ్యాఖ్యలు చేశారు.
యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికాతో ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం ఇక అమల్లో లేదని, అది చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు.
అలాగే హర్మూజ్ జలసంధి విషయంలో ఒమన్ సార్వభౌమాధికారాన్ని తమ దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించలేదని పేర్కొన్నారు.
ప్రాంతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని మాత్రమే జలసంధిపై నియంత్రణ చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు.