Raghuram Rajan: అమెరికా ఫెడ్ సంస్కరణల కమిటీలో రఘురామ్ రాజన్‌కు కీలక స్థానం.. ద్రవ్య విధానంపై కీలక బాధ్యతలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఫెడరల్ రిజర్వ్(ఫెడ్)తన ద్రవ్య విధానాలు, ఆర్థిక నిర్వహణలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తోంది. ఈ నిపుణుల జాబితాలో భారత మాజీ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)గవర్నర్ రఘురామ్ రాజన్‌కు స్థానం దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫెడ్ భవిష్యత్ విధానాల రూపకల్పనలో ఆయన సూచనలు కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ చేపట్టిన ప్రత్యేక సంస్కరణల కార్యక్రమంలో భాగంగా ఫెడ్ బ్యాలెన్స్ షీట్‌ను సమగ్రంగా పరిశీలించే కమిటీలో రఘురామ్ రాజన్‌ను సభ్యుడిగా నియమించారు. ద్రవ్య విధానాల రూపకల్పనలో కొత్త ఆలోచనలు,విభిన్న అభిప్రాయాలకు ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు వార్ష్ వెల్లడించారు.
వివరాలు
భిన్న అభిప్రాయాల నిపుణులను తీసుకురావడాన్ని సెనెట్ ప్రశంస
గత ఐదేళ్లుగా ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మించి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాలను పునఃసమీక్షించడం అవసరమైందని ఆయన పేర్కొన్నారు.
అమెరికా కాంగ్రెస్‌లో జరిగిన తొలి అర్ధవార్షిక ద్రవ్య విధాన విచారణ సందర్భంగా సెనెట్ బ్యాంకింగ్ కమిటీ ఛైర్మన్ టిమ్ స్కాట్ ఈనిర్ణయాన్ని స్వాగతించారు.
బ్యాలెన్స్ షీట్‌పై భిన్న దృక్పథాలు కలిగిన నిపుణులను ఒకే కమిటీలో చేర్చడం సముచిత నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు.
జెరెమీ స్టెయిన్‌తో పాటు రఘురామ్ రాజన్‌ను కూడా కమిటీలో భాగం చేయడం వల్ల అన్ని కోణాల్లో సమగ్ర చర్చకు అవకాశం లభిస్తుందని తెలిపారు.
ఈసందర్భంగా కెవిన్ వార్ష్ మాట్లాడుతూ.. తాను విశ్వసించే 15 మంది భిన్నాభిప్రాయాలు కలిగిన ఆర్థిక నిపుణులను వివిధ కమిటీల కోసం ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
వివరాలు
తొలి నివేదికలు సెప్టెంబర్‌లో, తుది సిఫార్సులు ఏడాది చివరికి
పారదర్శకతను పెంపొందించడంతో పాటు కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం అందించేందుకు ఈ కమిటీలు కీలక వేదికగా నిలుస్తాయని చెప్పారు.
టాస్క్‌ఫోర్స్‌లకు ఆరు నెలల గడువు నిర్దేశించినట్లు వార్ష్ తెలిపారు.
తొలి నివేదికలు సెప్టెంబర్ నాటికి అందే అవకాశం ఉందని,తుది సిఫార్సులు ఈ ఏడాది చివర్లో సమర్పించనున్నట్లు వెల్లడించారు.
అయితే ఇవి కేవలం సలహా కమిటీలు మాత్రమేనని,తుది ద్రవ్య విధాన నిర్ణయాలను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) తీసుకుంటుందని స్పష్టం చేశారు.
కాగా,రఘురామ్ రాజన్ 2013 నుంచి 2016 వరకు భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా సేవలందించారు.
ఆర్థిక స్థిరత్వం, ద్రవ్య విధానం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై ఆయనకు ఉన్న విశేష అనుభవం, నైపుణ్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆర్థిక నిపుణుడిగా గుర్తింపు పొందారు.