Loading...
US Sanctions Indian Couple: ఇరాన్ చమురు రవాణాలో సహకారం.. భారతీయ దంపతులపై అమెరికా చర్యలు
ఇరాన్ చమురు రవాణాలో సహకారం.. భారతీయ దంపతులపై అమెరికా చర్యలు

US Sanctions Indian Couple: ఇరాన్ చమురు రవాణాలో సహకారం.. భారతీయ దంపతులపై అమెరికా చర్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌కు సహకరించారన్న ఆరోపణలపై భారత్‌కు చెందిన వ్యాపారవేత్త, ఆయన భార్యపై అమెరికా ఆంక్షలు విధించింది. వీరితో పాటు భారత్‌, టర్కీలోని పలు కంపెనీలు, వ్యక్తులనూ ఆంక్షల జాబితాలో చేర్చింది. ఇరాన్ చమురు ఎగుమతులపై అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు సహకరించారన్న ఆరోపణలతో ఈ చర్యలు తీసుకుంది. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల అనంతరం ట్రెజరీ విభాగం ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బతీసి, అంతర్జాతీయంగా ఆ దేశాన్ని ఒంటరి చేయడమే లక్ష్యంగా అమెరికా 'ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్' పేరిట ఆంక్షలు అమలు చేస్తోంది. ఇరాన్ ప్రభుత్వానికి సహకరించే వారిపైనా చర్యలు తప్పవని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది.

వివరాలు 

ఈ జాబితాలో శర్మకు చెందిన తొమ్మిది సంస్థలు 

ఈ నేపథ్యంలో భారతీయ వ్యాపారవేత్త సునీల్ కుమార్ శర్మ, ఆయన భార్య జస్‌ప్రీత్ ప్రీతి షాహిద్‌తో పాటు మరో ఇద్దరు భారతీయులపై ఆంక్షలు విధించింది.

శర్మకు చెందిన తొమ్మిది సంస్థలను కూడా ఈ జాబితాలో చేర్చింది. ఇరాన్ పెట్రోలియం రవాణాలో పాల్గొన్న ఆంక్షలు ఎదుర్కొంటున్న నౌకలకు తప్పుడు గుర్తింపు, ధ్రువీకరణ పత్రాలు అందించడంలో వీరు సహకరించారని అమెరికా ట్రెజరీ విభాగం పేర్కొంది.

ఇరాన్ సైన్యం, దాని అనుబంధ సంస్థలకు చెందిన నౌకలకు కూడా ఇలాంటి సేవలు అందించినట్లు ఆరోపించింది.

టర్కీకి చెందిన ఫుగో గ్రౌండ్ సర్వీసెస్ సంస్థపైనా అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ విమానయాన రంగానికి మద్దతు ఇస్తున్నందనే ఆరోపణతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.

వివరాలు 

ఇరాన్ పాలనకు మద్దతు ఇచ్చేవారిపై ఆంక్షలు తప్పవు

ఇరాన్‌కు మద్దతు ఇచ్చేవారిపై కఠిన చర్యలు తప్పవని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మరోసారి హెచ్చరించారు.

''మీరు మాతో ఉన్నారా? మాకు వ్యతిరేకంగా ఉన్నారా? అనేది మేం తెలుసుకుంటాం. ఇరాన్ పాలనకు మద్దతు ఇచ్చేవారిపై ఆంక్షలు తప్పవు'' అని స్పష్టం చేశారు.

ADVERTISEMENT