LOADING...
US sanctions: ఇరాన్ చమురు కొనుగోలు..భారతీయులు సహా 50 కి పైగా సంస్థలపై అమెరికా ఆంక్షలు 
ఇరాన్ చమురు కొనుగోలు..భారతీయులు సహా 50 కి పైగా సంస్థలపై అమెరికా ఆంక్షలు

US sanctions: ఇరాన్ చమురు కొనుగోలు..భారతీయులు సహా 50 కి పైగా సంస్థలపై అమెరికా ఆంక్షలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2025
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు, మార్కెటింగ్‌ చేస్తున్నారన్న ఆరోపణలపై అమెరికా భారీ చర్యలు చేపట్టింది. ఇరాన్‌ చమురు వ్యాపారంలో పాలుపంచుకున్నట్లు తేలడంతో 50కి పైగా సంస్థలు,వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ఈ జాబితాలో కొందరు భారతీయులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ విభాగం తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అమెరికా పేర్కొన్న వివరాల ప్రకారం,కొన్ని సంస్థలు బిలియన్ల డాలర్ల విలువైన ఇరాన్‌ చమురు, లిక్విఫైడ్‌ గ్యాస్‌ కొనుగోలు,విక్రయాలు నిర్వహిస్తూ ఆ దేశ పాలనకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయని పేర్కొంది. అంతేకాదు,అమెరికా వ్యతిరేక ఉగ్రవాద గ్రూపులకు కూడా మద్దతు ఇస్తున్నారని ట్రెజరీ ఆరోపించింది.

వివరాలు 

ఆంక్షల జాబితాలో భారతీయులు 

ఈ సందర్భంలో ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ మాట్లాడుతూ, ఇరాన్‌ ఇంధన ఎగుమతులను అడ్డుకునేందుకు, దానికి వచ్చే నగదు ప్రవాహాన్ని నిలిపివేయటానికి ఈ ఆంక్షలు విధిస్తున్నామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం, దేశ భద్రతకు ముప్పు కలిగించే ఉగ్రవాద గ్రూపులకు నిధులు అందకుండా అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తాజాగా విడుదలైన ఆంక్షల జాబితాలో భారతీయులైన వరుణ్‌ పులా,సోనియా శ్రేష్ఠ,అయ్యప్పన్‌ రాజా పేర్లు కూడా ఉండటం విశేషం. ఇరాన్‌ చమురు ఉత్పత్తులను రవాణా చేసే షిప్పింగ్‌ కార్యకలాపాలకు వీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం కలిగి ఉన్నట్లు అమెరికా ట్రెజరీ పేర్కొంది.

వివరాలు 

టెల్‌ అవీవ్‌ నుంచి పాకిస్థాన్‌కు ఎల్‌పీజీ రవాణా చేస్తున్న సోనియా శ్రేష్ఠ సంస్థ

ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం,వరుణ్‌ పులా సంస్థకు చెందిన ఓ నౌక గతేడాది జూలైలో ఇరాన్‌ నుంచి నాలుగు మిలియన్‌ బ్యారెల్స్‌ లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ)ను చైనాకు రవాణా చేసినట్లు తేలింది. అదే విధంగా అయ్యప్పన్‌ రాజా సంస్థకు చెందిన మరో నౌక కూడా గత ఏప్రిల్‌లో ఇరాన్‌ ఎల్‌పీజీని చైనాకు పంపిందని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా సోనియా శ్రేష్ఠకు చెందిన సంస్థ కూడా టెల్‌ అవీవ్‌ నుంచి ఎల్‌పీజీని పాకిస్థాన్‌కు రవాణా చేసినట్లు అమెరికా ఆరోపిస్తోంది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, వీరిపై అమెరికా ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించినట్లు వెల్లడించింది.