Green Card: వైట్ హౌస్ సమీపంలో కాల్పుల ఘటన.. గ్రీన్ కార్డు హోల్డర్స్‌పై ట్రంప్ ఫోకస్..!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు అతి చేరువలో నేషనల్ గార్డులపై జరిగిన కాల్పుల ఘటనతో అగ్రరాజ్యం తీవ్రంగా షాక్‌కు గురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌కార్డ్ (Green Card) హోల్డర్లను లక్ష్యంగా చేసుకుంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 19 దేశాలకు చెందిన గ్రీన్‌కార్డ్ హోల్డర్స్ వివరాలను మరోసారి పూర్తిగా పరిశీలించాలని ఆదేశించారు . వైట్‌హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల అనంతరం అఫ్గానిస్థాన్ (Afghanistan) పౌరుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని అఫ్గాన్‌తో పాటు మరో 18 దేశాల గ్రీన్‌కార్డ్ హోల్డర్ల నేపథ్యాన్ని పునఃసమీక్షించనున్నట్లు యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో తెలిపారు.
వివరాలు
12 దేశాల పౌరులపై నిషేధం
అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈ చర్యలు మొదలయ్యాయని ఆయన ఎక్స్ (Twitter) లో వెల్లడించారు. గతంలో కూడా ట్రంప్ (Donald Trump) యునైటెడ్ స్టేట్స్‌కు ప్రయాణించే 12 దేశాల పౌరులపై నిషేధం విధిస్తూ ఒక ముఖ్యమైన ఉత్తర్వుపై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో అఫ్గానిస్థాన్,ఇరాన్,యెమెన్,మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలు ఉన్నాయి. ఇదే విధంగా మరో ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై పరిమిత ఉంచిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కాలంలో వీటి అమల్లో కొన్ని మార్పులు వచ్చినప్పటికీ, ఇప్పుడు ట్రంప్ పరిపాలన తిరిగి ఆ దేశాల వ్యక్తులపై సమగ్ర సమీక్ష చేపట్టనుందని తెలుస్తోంది.
వివరాలు
మహిళా నేషనల్ గార్డ్ మృతి
వైట్‌హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల్లో గాయపడిన ఇద్దరు నేషనల్ గార్డుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరణించినది మహిళా గార్డ్ సారా బెక్‌స్ట్రోమ్ అని ట్రంప్ ధృవీకరించారు. మరో గార్డ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, అతను ప్రాణాల కోసం పోరాడుతున్నాడని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.