LOADING...
H-1B visa: ఆగస్టు నుంచి అమెరికా వీసా నిబంధనల కఠినతరం.. హెచ్‌1బీపై కొత్త మార్పులు
ఆగస్టు నుంచి అమెరికా వీసా నిబంధనల కఠినతరం.. హెచ్‌1బీపై కొత్త మార్పులు

H-1B visa: ఆగస్టు నుంచి అమెరికా వీసా నిబంధనల కఠినతరం.. హెచ్‌1బీపై కొత్త మార్పులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2026
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోకి విదేశీయుల ప్రవేశాన్ని మరింత కట్టుదిట్టం చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే ఉద్యోగ నిపుణులు, అంతర్జాతీయ విద్యార్థులు, విదేశీ ఉద్యోగులను నియమించే సంస్థలు మరిన్ని నిబంధనలు, తనిఖీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వచ్చే ఆగస్టు నుంచి హెచ్‌1బీ, ఎల్‌1, విద్యార్థుల ఎఫ్‌ వీసాలు, గ్రీన్‌కార్డు ప్రక్రియలకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు తీసుకురావడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో అమెరికాకు వెళ్లే భారతీయులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

వివరాలు 

హెచ్‌1బీపై మరింత కఠిన నిబంధనలు

హెచ్‌-1బీ వీసా వ్యవస్థను మరింత కఠినతరం చేసేందుకు అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) వచ్చే నెలలో కొత్త ప్రతిపాదనలను విడుదల చేయనుంది. ప్రస్తుతం కొన్ని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలకు ఉన్న హెచ్‌1బీ మినహాయింపులను తొలగించే అవకాశముంది. థర్డ్ పార్టీ క్లయింట్ల వద్ద హెచ్‌1బీ ఉద్యోగులను నియమించే సంస్థలపై అదనపు నిబంధనలు అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో వీసా నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై మరింత నిఘా ఉంచనున్నారు. ముఖ్యంగా భారతీయ ఐటీ, కన్సల్టింగ్ సంస్థలు విస్తృతంగా అనుసరిస్తున్న థర్డ్ పార్టీ నియామక విధానంపై ఈ మార్పుల ప్రభావం పడే అవకాశం ఉంది.

వివరాలు 

హెచ్‌1బీ ఫీజుల్లోనూ పెంపు

ప్రస్తుతం కొన్ని పెద్ద సంస్థల నుంచి మాత్రమే వసూలు చేస్తున్న అదనపు (సప్లిమెంటల్) ఫీజును మరింత విస్తరించాలని డీహెచ్‌ఎస్ యోచిస్తోంది. ఇప్పటివరకు తొలిసారి దాఖలు చేసే హెచ్‌1బీ పిటిషన్లు, కంపెనీ మారిన సందర్భాల్లో మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుండగా, ఇకపై వీసా పొడిగింపు దరఖాస్తులకూ వర్తించే అవకాశం ఉంది. అలాగే 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో, వారిలో కనీసం 50 శాతం మంది హెచ్‌1బీ లేదా ఎల్‌1 వీసాదారులే ఉంటే, అలాంటి సంస్థలపై మరింత అధిక ఫీజులు విధించే ప్రతిపాదన ఉంది.

Advertisement

వివరాలు 

గ్రీన్‌కార్డు ప్రక్రియ కూడా ఖరీదే!

ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డులు, హెచ్‌1బీ వీసాలకు విదేశీ ఉద్యోగులను స్పాన్సర్ చేసే సంస్థలపై రుసుములు పెంచాలని అమెరికా కార్మికశాఖ పరిశీలిస్తోంది. అదే సమయంలో హెచ్‌1బీ, PERM లేబర్ సర్టిఫికేషన్ కేసుల్లో వేతన ప్రమాణాలను కూడా సవరించాలనే యోచనలో ఉంది. ప్రస్తుతం ఎంట్రీ లెవల్ ఉద్యోగాల వేతన ప్రమాణం 17వ పర్సంటైల్‌లో ఉండగా, దానిని 34వ పర్సంటైల్‌కు పెంచే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి ఉద్యోగాల వేతన ప్రమాణాలు కూడా గణనీయంగా పెరగనున్నాయి.

Advertisement

వివరాలు 

పీఈఆర్‌ఎం ప్రక్రియలో కీలక మార్పులు

ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డు పొందడంలో కీలకమైన PERM లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియలో కూడా పలు మార్పులు ప్రతిపాదించారు. ఉద్యోగ నియామక ప్రమాణాలు, స్థానిక ఉద్యోగుల రక్షణ, వివక్ష నిరోధక చర్యలను మరింత కఠినంగా అమలు చేసే విధంగా కొత్త నిబంధనలు రూపొందించే అవకాశం ఉంది. విద్యార్థుల వీసాలపై ప్రభావం వలస విధానాల్లో మార్పుల ప్రభావం అంతర్జాతీయ విద్యార్థులపైనా పడనుంది. ప్రస్తుతం విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండేందుకు అనుమతి లభిస్తోంది. అయితే కొత్త ప్రతిపాదనల ప్రకారం ఎఫ్‌ వీసాలు నిర్ణీత కాలపరిమితితోనే జారీ చేసే అవకాశం ఉంది. ఆ గడువులో కోర్సు పూర్తి చేయలేకపోతే మరోసారి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు 

ఓపీటీ, సీపీటీ నిబంధనలూ కఠినమే

2027 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశమున్న మరో ప్రతిపాదన ప్రకారం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) నిబంధనలను మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నారు. ఇందులో STEM-OPTతో పాటు కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (CPT) కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దీంతో చదువు పూర్తయ్యాక ఉద్యోగ అనుభవం పొందే అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

వివరాలు 

హెచ్‌4 వీసాదారుల ఉద్యోగాలపైనా ప్రభావం

హెచ్‌1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్‌4 వీసాలపై కూడా నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. వీరికి జారీ చేసే ఉద్యోగ అనుమతి పత్రాలు (EAD) విషయంలో మార్పులు తీసుకురానున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఈఏడీలకు ఆటోమేటిక్ పొడిగింపు లభిస్తోంది. అయితే కొత్త విధానంలో ప్రతి రెన్యువల్‌కు తప్పనిసరిగా కొత్త దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. 180 రోజుల ముందే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్రాసెసింగ్ ఆలస్యం జరిగితే కొంతకాలం ఉద్యోగ అనుమతి లేకుండా ఉండే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.

Advertisement