LOADING...
USA: తైవాన్‌  సమీపంలో చైనా సైనిక విన్యాసాలు.. బీజింగ్‌కు సంయమనం పాటించాలని అమెరికా హెచ్చరిక
బీజింగ్‌కు సంయమనం పాటించాలని అమెరికా హెచ్చరిక

USA: తైవాన్‌  సమీపంలో చైనా సైనిక విన్యాసాలు.. బీజింగ్‌కు సంయమనం పాటించాలని అమెరికా హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2026
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

తైవాన్‌ అంశంపై చైనా అవలంబిస్తున్న విధానాల పట్ల అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తైవాన్‌ జలసంధి పరిసర ప్రాంతాల్లో చైనా చేపట్టిన సైనిక చర్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీజింగ్‌ సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు పెంచే చర్యలను నిలిపివేయాలని అమెరికా కోరింది. ఇటీవల తైవాన్‌ చుట్టూ చైనా భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలు నిర్వహించడంతో అంతర్జాతీయంగా కలవరం రేగిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై తాజాగా అమెరికా విదేశాంగశాఖ స్పందించింది.

వివరాలు 

తైవాన్‌పై సైనిక ఒత్తిడిని తగ్గించాలి : అమెరికా 

తైవాన్‌ పరిసరాల్లో చైనా చేపడుతున్న సైనిక విన్యాసాలు, బెదిరింపులు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయని అమెరికా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. బీజింగ్‌ సంయమనం పాటించి, తైవాన్‌పై సైనిక ఒత్తిడిని తగ్గించాలని కోరింది. సమస్యను దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నట్లు విదేశాంగశాఖ ప్రతినిధి టామీ పిగోట్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తైవాన్‌ జలసంధిలో శాంతి, స్థిరత్వం కొనసాగేందుకు అమెరికా పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. ఏకపక్షంగా బలవంతపు చర్యలు, బెదిరింపులను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన వెల్లడించారు.

వివరాలు 

తైవాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఎప్పటికీ ఆగదు:  జిన్‌పింగ్‌  

ఈ వారం ఆరంభంలో తైవాన్‌ చుట్టూ చైనా భారీ స్థాయిలో నౌకాదళ, వైమానిక దళాల విన్యాసాలు చేపట్టింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే తైవాన్‌ చుట్టూ 130 యుద్ధ విమానాలు, 14 యుద్ధ నౌకలను చైనా మోహరించిందని తైపీ రక్షణశాఖ వెల్లడించింది. ఈ చర్యలను తైవాన్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉండగా, కొత్త సంవత్సరం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తైవాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఎప్పటికీ ఆగదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. దీనికి ప్రతిస్పందనగా, చైనా విస్తరణవాద ధోరణుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామని తైవాన్‌ అధ్యక్షుడు లై చింగ్‌ తె స్పష్టం చేశారు.

Advertisement