
దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ విమానాల విన్యాసాలు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌక కదలికలతో చైనా మండిపడుతోంది. రెండు వారాల క్రితం దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా అతిపెద్ద యుద్ధనౌక 'నిమిట్జ్' వచ్చింది. తాజాగా డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌లను దక్షిణ చైనా సముద్రంలో ఆగ్రరాజ్యం ప్రదర్శించింది. దీంతో చైనా అగ్గిలం మీద గుగ్గిలం అవుతోంది.
ఎంహెచ్-60 సీహాక్ హెలికాప్టర్‌లు, ఎఫ్/ఏ-18 హార్నెట్ జెట్ శ్రేణిలోని 'ఫోజీ బేర్', 'పిగ్ స్వెట్', 'బోంగో' వంటి జెట్లను అమెరికా ప్రదర్శించింది.
అమెరికాకు చెందిన యుద్ధ నౌక రెండు వారాల క్రితం తైవాన్ జలసంధి మీదుగా ప్రయాణించింది. దక్షిణ చైనా సముద్రంలో తైవాన్ జలసంధి ఒక భాగం. చైనా దీనిపై తీవ్రంగా స్పందించింది. అమెరికా బల ప్రదర్శనకు పాల్పడుతోందని ఆరోపించింది.
అమెరికా
అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ప్రయాణిస్తున్నాం: అమెరికా
యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శనపై అమెరికా గ్రూప్ కమాండర్, రియర్ అడ్మిరల్ క్రిస్టోఫర్ స్వీనీ స్పందించారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఈ జలాలు, గగనతలంలో ప్రయాణించే స్వేచ్ఛను పటిష్ఠం చేసేందుకు ఈ సముద్రం మార్గంలోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
అంతర్జాతీయ నిబంధనలు, నియమాలు అనుమతించే చోటే తాము ప్రయాణిస్తున్నట్లు క్రిస్టోఫర్ స్వీనీ చెప్పారు.
దాదాపు 3.4 ట్రిలియన్ల వార్షిక వాణిజ్యానికి మార్గంగా ఉన్న దక్షిణ చైనా సముద్రంలో అమెరికా ఉనికిని జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా వంటి మిత్రదేశాలు స్వాగతించాయి.
ఇప్పటికే వియత్నాం, మలేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్‌ల ప్రత్యేక ఆర్థిక జోన్లతో పాటు మొత్తం దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం తమదే అని చెబుతున్న చైనా, అమెరికా యుద్ధ విమానాల విన్యాసాలను జీర్ణించుకోలేకపోతోంది.