LOADING...
Green Card:యూఎస్‌సీఐఎస్ కీలక నిర్ణయం.. గ్రీన్‌కార్డు ప్రక్రియకు కొత్త కఠిన నిబంధనలు
యూఎస్‌సీఐఎస్ కీలక నిర్ణయం.. గ్రీన్‌కార్డు ప్రక్రియకు కొత్త కఠిన నిబంధనలు

Green Card:యూఎస్‌సీఐఎస్ కీలక నిర్ణయం.. గ్రీన్‌కార్డు ప్రక్రియకు కొత్త కఠిన నిబంధనలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 23, 2026
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్‌కార్డు) కోరే తాత్కాలిక వలసదారులు ఇకపై దరఖాస్తులు సమర్పించేందుకు తమ స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) స్పష్టం చేసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని యూఎస్‌సీఐఎస్‌ ప్రతినిధి జాక్‌ కహ్లర్‌ పేర్కొన్నారు. 'అమెరికాలో తాత్కాలికంగా నివసిస్తున్న విదేశీయులు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే ఇకపై తమ మాతృదేశానికి వెళ్లి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుందని ఆయన తెలిపారు.

వివరాలు

నూతన పాలసీ మెమో రిలీజ్

అమెరికా వలస చట్టాల అసలు ఉద్దేశానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాక్‌ కహ్లర్‌ వివరించారు. ఈ మేరకు కొత్త పాలసీ మెమోను యూఎస్‌సీఐఎస్‌ విడుదల చేసింది. అయితే అసాధారణ పరిస్థితుల్లో మాత్రం అమెరికా నుంచే 'అడ్జస్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేటస్‌'కు దరఖాస్తు చేసుకునే అవకాశం కొనసాగుతుందని సంస్థ స్పష్టం చేసింది. అలాంటి మినహాయింపు కోరే దరఖాస్తుదారుల కేసుల్లో అధికారులు అన్ని పత్రాలను క్షుణ్నంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ విధానం వల్ల వలస వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని, చట్టంలోని లోపాలను ఉపయోగించుకుని వ్యవస్థను దుర్వినియోగం చేసే అవకాశాలు తగ్గుతాయని జాక్‌ కహ్లర్‌ తెలిపారు.

వివరాలు

పని పూర్తయ్యాక దేశం విడిచి వెళ్లాల్సిందే

గ్రీన్‌కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురైన తర్వాత కూడా అమెరికాలో అక్రమంగా ఉండే వారి సంఖ్య తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, తాత్కాలిక ఉద్యోగులు, టూరిస్టు వీసాపై అమెరికాకు వచ్చిన వారు తమ పని పూర్తయ్యాక తప్పనిసరిగా దేశం విడిచి వెళ్లాలని, గ్రీన్‌కార్డు పొందడమే వారి ప్రయాణ లక్ష్యంగా మారకూడదని కహ్లర్‌ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా యూఎస్‌సీఐఎస్‌ చర్యల ప్రభావంతో 2027 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య 38.5 శాతం తగ్గింది. 2026 ఆర్థిక సంవత్సరంలో 3,43,981 దరఖాస్తులు రాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవి 2,11,600కు తగ్గాయి. ఆమోదాల్లో ఉన్నత డిగ్రీలు కలిగి అధిక వేతనాలు పొందుతున్న అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది.

Advertisement