
Lalit Modi: లలిత్ మోదీ పాస్‌పోర్ట్ రద్దుకు వనువాటు ప్రధానమంత్రి ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ పసిఫిక్ ద్వీప దేశమైన వనాటుకి స్థిరపడనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆయన ఆ దేశానికి చెందిన గోల్డెన్ పాస్‌పోర్టును పొందినట్లు సమాచారం. అయితే, లలిత్ మోదీకి ఇచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని జోథం నపాట్ పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వనాటు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్న విధానం ఆసక్తికరంగా మారింది.
వివరాలు
వనాటు పౌరసత్వాన్ని పొందడానికి చట్టబద్ధమైన కారణాలు
"లలిత్ మోదీ దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఇంటర్‌పోల్ స్క్రీనింగ్ సహా అన్ని ప్రామాణిక నేపథ్య పరిశీలనలను నిర్వహించాం.అప్పటికి ఆయనపై ఎటువంటి నేరారోపణలు లేవని తేలింది.అయితే, గత 24 గంటల్లో భారత ప్రభుత్వం ఇంటర్‌పోల్‌కు రెండుసార్లు అభ్యర్థనలు చేసి,మోదీపై హెచ్చరిక నోటీసును జారీ చేయాలని కోరింది. కానీ తగిన ఆధారాలు లేకపోవడంతో ఇంటర్‌పోల్ ఈ అభ్యర్థనలను తిరస్కరించింది. అయితే, వనాటు పౌరసత్వాన్ని పొందడానికి చట్టబద్ధమైన కారణాలు ఉండాలి. కానీ లలిత్ మోదీ స్వదేశంలో దర్యాప్తును తప్పించుకోవడానికి వనాటు పౌరసత్వాన్ని పొందినట్లు తెలుస్తోంది. ఆయన చూపించిన కారణం చట్టబద్ధంగా సరిపోకపోవడంతో, ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించాం'' అని వనాటు ప్రధాని పేర్కొన్నారు.
వివరాలు
15 ఏళ్లుగా లండన్‌లో..
వనాటు పౌరసత్వం తీసుకున్న నేపథ్యంలో, లలిత్ మోదీ భారత పాస్‌పోర్టును అప్పగించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. లండన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఇటీవల దీనికి సంబంధించి దరఖాస్తు సమర్పించాడు. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందిస్తూ, నిబంధనల ప్రకారం దీనిని పరిశీలిస్తున్నామని, అలాగే ఆయనపై ఉన్న కేసును చట్ట ప్రకారం కొనసాగిస్తామని వెల్లడించింది. లలిత్ మోదీ ఐపీఎల్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో, భారత అధికారులకు చిక్కకుండా గత 15 ఏళ్లుగా లండన్‌లో తలదాచుకున్నాడు. ప్రస్తుతం, భారత ప్రభుత్వం ఆయనను స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.
వివరాలు
లలిత్ మోదీ వనాటు దేశాన్ని ఆశ్రయించడానికి కారణాలు..
లలిత్ మోదీ వనాటు దేశాన్ని ఆశ్రయించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి : వ్యాపార సంస్థను రిజిస్టర్ చేసుకొని దేశం వెలుపలి నుంచి ఆదాయం సంపాదించినా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం. గిఫ్ట్, ఎస్టేట్ ట్యాక్స్‌లు లేకపోవడం. వనాటు ప్రస్తుతం క్రిప్టో హబ్‌గా అభివృద్ధి చెందుతున్న దేశం కావడం. స్థానికంగా లేదా అంతర్జాతీయంగా వచ్చిన ఆదాయంపై ఎలాంటి ఆదాయపన్ను లేకపోవడం. దీర్ఘకాలిక లాభాలపై కూడా పన్ను విధించకుండా ఉండటం. ముఖ్యంగా స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు చేసే వారికి ఎంతో ప్రయోజనకరంగా మారడం. ఈ కారణాల వల్ల లలిత్ మోదీ వనాటు పౌరసత్వాన్ని పొందాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.