Venezuela: వెనిజువెలా భూకంపం బీభత్సం.. 3,889కు చేరిన మృతుల సంఖ్య
ఈ వార్తాకథనం ఏంటి
వెనిజులాను వణికించిన భూకంపాల విధ్వంసం రోజురోజుకూ మరింత విషాదాన్ని మిగులుస్తోంది. రెండు వారాల క్రితం సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య 3,889కు చేరింది. మరో 17 వేల మందికిపైగా గాయపడగా, వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల పునరుద్ధరణ కోసం ఐక్యరాజ్యసమితి అత్యవసర నిధుల సేకరణ చర్యలను ప్రారంభించింది. జంట భూకంపాలతో భారీ విధ్వంసం జూన్ 24న వెనిజువెలాలో వరుసగా 7.2,7.5 తీవ్రతలతో సంభవించిన రెండు భూకంపాలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. నేషనల్ అసెంబ్లీ చీఫ్ జార్జ్ రోడ్రిగ్జ్ టెలిగ్రామ్‌లో వెల్లడించిన సమాచారం ప్రకారం,ఈ విపత్తులో 17 వేల మందికిపైగా గాయపడగా,మరో 18 వేల మంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
వివరాలు
అంతర్జాతీయ సహాయం.. నష్టం అంచనాలు
ఈ పరిస్థితుల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు విదేశాల్లో స్తంభింపజేసిన వెనిజువెలా నిధులను వెంటనే విడుదల చేయాలని తాత్కాలిక నాయకురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అంతర్జాతీయ వర్గాలను కోరారు. భూకంప ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణపై ఐక్యరాజ్యసమితి చర్యలు చేపడుతోంది. అదే సమయంలో, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వద్ద నిలిచిపోయిన వెనిజువెలా ఆర్థిక ఆస్తుల విడుదలపై చర్చలు కొనసాగుతున్నాయని ఆ సంస్థ ప్రతినిధి జూలీ కోజాక్ తెలిపారు. భూకంప ప్రభావం అత్యధికంగా కనిపించిన తీరప్రాంతమైన 'లా గుయైరా'లో 800కుపైగా భవనాలు దెబ్బతిన్నాయి. వాటిలో 190 భవనాలు పూర్తిగా కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
శకలాల కింద ఆశల వేట
విపత్తు జరిగి దాదాపు 15 రోజులు కావడంతో ప్రాణాలతో ఉన్నవారి కోసం చేపట్టిన గాలింపు చర్యలను రెస్క్యూ బృందాలు దాదాపుగా ముగిస్తున్నాయి. అయినప్పటికీ, తమ కుటుంబ సభ్యుల కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి. లా గుయైరా నగరంలోని ప్లాయా గ్రాండే ప్రాంతంలో భారీ శిథిలాల కింద తన ఇద్దరు టీనేజ్ కుమారులు చిక్కుకున్న ప్రాంతాన్ని గుర్తించానని సిరో ఒక్యాండో అనే వ్యక్తి తెలిపారు. వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువని తెలిసినా, కనీసం తమ కుమారుల మృతదేహాలనైనా వెలికితీయాలని కోరుకుంటున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
ఇద్దరు కుమారుల కోసం తండ్రి అన్వేషణ
శిథిలాలను స్వయంగా చేతి పరికరాలతో తొలగిస్తూ, "నేను సరైన ప్రదేశంలోనే వెతుకుతున్నాను. కానీ ఇక్కడ శకలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి" అంటూ ఆయన మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. తన ఇద్దరు కుమారుల కోసం తండ్రి చేస్తున్న ఈ నిరంతర అన్వేషణ అక్కడున్న వారిని, ఈ ఘటన గురించి తెలుసుకున్న వారిని తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది.