Loading...
'doomsday war': డూమ్స్‌డే వార్‌ హెచ్చరిక.. అమెరికాకు ఇరాన్‌ కీలక వార్నింగ్‌.. ట్రంప్‌ ఏమన్నారంటే
ట్రంప్‌ ఏమన్నారంటే

'doomsday war': డూమ్స్‌డే వార్‌ హెచ్చరిక.. అమెరికాకు ఇరాన్‌ కీలక వార్నింగ్‌.. ట్రంప్‌ ఏమన్నారంటే

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 28, 2026
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. హర్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవడంతో పాటు యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్‌ ప్రతిపాదించిన ఏడు రోజుల రోడ్‌మ్యాప్‌ను అమెరికా తిరస్కరించింది. దీంతో అవసరమైతే భీకరమైన యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు తమ దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని ఇరాన్‌ స్పష్టం చేసింది. యుద్ధం మళ్లీ మొదలైతే ఈసారి పరిణామాలు ఎవరూ ఊహించని స్థాయిలో తీవ్రంగా ఉండొచ్చని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ హెచ్చరించారు. పరిస్థితి 'డూమ్స్‌డే వార్‌' తరహా ప్రళయ స్థాయికి చేరినా ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని అమెరికాకు సంకేతం ఇచ్చారు. అయితే అదే సమయంలో దౌత్యానికి సంబంధించిన అవకాశాలను పూర్తిగా మూసివేయలేదని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

డిమాండ్లను అంగీకరించేందుకు అమెరికా సిద్ధంగా లేదు: మైక్‌ వాల్ట్జ్

హర్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవడం, యుద్ధాన్ని ముగించే దిశగా ముందుకు వెళ్లడం కోసం ఇరాన్‌ ఏడు రోజుల ప్రణాళికను ప్రతిపాదించింది.

అయితే ఈ ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది.

ఇరాన్‌ తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు స్తంభింపజేసిన బిలియన్ల డాలర్ల నిధులను విడుదల చేయాలని కోరిందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్‌ వాల్ట్జ్‌ తెలిపారు.

ఈ డిమాండ్లను అంగీకరించేందుకు అమెరికా సిద్ధంగా లేదని చెప్పారు.

ఇవి కేవలం అమెరికా విధించిన ఆంక్షలు మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆంక్షలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

'యుద్ధం త్వరలో ముగుస్తుంది'.. ట్రంప్

ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ హెచ్చరికలు చేసిన కొద్దిసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ వారంలో ఇరాన్‌తో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.

ప్రస్తుత యుద్ధంలో అమెరికా 'త్వరలోనే విజయం సాధిస్తుంది' అని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఇరాన్‌ ప్రతిపాదనను అమెరికా తిరస్కరించినప్పటికీ.. దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

న్యూయార్క్‌లో జరుగుతున్న ఐరాస సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో ఇరాన్‌ ప్రతినిధులతో దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సెంటర్‌ ఫర్‌ మిడిల్‌ ఈస్ట్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ సీనియర్‌ పరిశోధకుడు అబ్బాస్‌ అస్లానీ తెలిపారు.

మధ్యవర్తుల ద్వారా అమెరికా నుంచి అధికారిక స్పందన కోసం ఇరాన్‌ ఎదురుచూస్తోందని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు 

డ్రోన్‌ స్వాధీనం చేసుకున్నామన్న ఇరాన్‌ ప్రకటనపై..

ఇరు దేశాల వద్ద ఉన్న ప్రధాన ఒత్తిడి సాధనాల్లో ముందుగా ఎవరు వెనక్కి తగ్గుతారన్నదే ప్రస్తుతం కీలక అంశంగా మారిందని ఆయన విశ్లేషించారు.

హర్ముజ్‌ జలసంధిలో అమెరికాకు చెందిన అధునాతన అండర్‌వాటర్‌ డ్రోన్‌ను ఇరాన్‌ సైన్యం స్వాధీనం చేసుకుందన్న వార్తలు కూడా ఉద్రిక్తతలను మరింత పెంచాయి.

అయితే ఇరాన్‌ చేసిన ఈ ప్రకటనను అమెరికా సైన్యం ఖండించింది.

డ్రోన్‌ తమ ఆధీనంలోకి వెళ్లిందన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. ఇరాన్‌పై అమెరికా దాడులకు ఉపయోగిస్తున్న బ్రిటన్‌లోని ఓ వైమానిక స్థావరం సమీపంలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

పేలుడు పదార్థాలు, ఉగ్రవాదానికి సంబంధించిన నేరాలకు పాల్పడినట్లు అనుమానాల నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

నస్రల్లా హంతకులను శిక్షించాల్సిందే..

అరెస్టయిన వారు ఇరాన్‌ పౌరులని తెలుస్తోంది.

హెజ్‌బొల్లా నేత హసన్‌ నస్రల్లా హత్యకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఇరాన్‌ మరోసారి ఇజ్రాయెల్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది.

నస్రల్లా హత్యను 'క్షమించరాని నేరం'గా అభివర్ణించిన ఇరాన్‌ విదేశాంగ శాఖ.. ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాలని ప్రపంచ దేశాలను కోరింది.

2024 సెప్టెంబర్‌ 27న బీరుట్‌ దక్షిణ శివార్లలో ఇజ్రాయెల్‌ నిర్వహించిన వైమానిక దాడుల్లో నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే.

వివరాలు 

నస్రల్లా హంతకులను శిక్షించాల్సిందే..

మొత్తంగా హర్ముజ్‌ జలసంధిని తెరవడం, ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేత, అణు కార్యక్రమం వంటి కీలక అంశాలపై అమెరికా-ఇరాన్‌ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ఒకవైపు చర్చలకు అవకాశం ఉందన్న సంకేతాలు కనిపిస్తుండగా.. మరోవైపు యుద్ధం తిరిగి ప్రారంభమైతే పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌ హెచ్చరిస్తోంది.

దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి.

ADVERTISEMENT