Liaquat Ali: పాక్ తొలి ప్రధాని హత్యకు 75 ఏళ్లు.. ఇప్పటికీ వీడని మిస్టరీ!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ తొలి ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్ హత్య జరిగి 75 ఏళ్లు పూర్తయ్యాయి. 1951 అక్టోబర్ 16న రావల్పిండిలో జరిగిన బహిరంగ సభలో ఆయన దారుణ హత్యకు గురయ్యారు. దశాబ్దాలు గడిచినా ఈ హత్య వెనుక అసలు కారణాలు, కుట్రకు పాల్పడిన వ్యక్తుల వివరాలు ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. పాకిస్థాన్ రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన ఈ ఘటన నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
వివరాలు
ఏం జరిగింది?
1951 అక్టోబర్ 16న రావల్పిండిలోని కంపెనీ బాగ్(ప్రస్తుతం లియాఖత్ బాగ్)లో లియాఖత్ అలీ ఖాన్ బహిరంగ సభలో ప్రసంగించేందుకు వచ్చారు.
ఆయన 'బరాదరాన్-ఎ-మిల్లత్'(సోదర జనాంగమా)అంటూ ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే సభలో ఉన్న సయీద్ అక్బర్ అనే ఆఫ్ఘన్ జాతీయుడు తుపాకీతో రెండుసార్లు కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 56ఏళ్ల లియాఖత్ అలీ ఖాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అయితే,అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ ఘటనలో కీలకమైన మరో పరిణామం చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన వెంటనే పోలీసులు సయీద్ అక్బర్‌ను అక్కడికక్కడే కాల్చి చంపారు.
దీంతో అతడిని విచారించి హత్య వెనుక ఉన్న కారణాలు, ఇతర వ్యక్తుల ప్రమేయం గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది.
వివరాలు
దర్యాప్తు.. అనుమానాలెన్నో!
నిందితుడిని సజీవంగా పట్టుకోకుండా ఎందుకు చంపేశారనే ప్రశ్నలు ఆ తర్వాత అనేక అనుమానాలకు, కుట్ర సిద్ధాంతాలకు కారణమయ్యాయి.
లియాఖత్ అలీ ఖాన్ హత్యపై 1951-52మధ్య అధికారిక కమిషన్ విచారణ చేపట్టింది.
అనంతరం బ్రిటన్‌కు చెందిన స్కాట్లాండ్ యార్డ్ బృందం కూడా ఈ కేసును దర్యాప్తు చేసింది.
అయినప్పటికీ హత్యకు అసలు కారణం ఏమిటో,దీని వెనుక ఎవరున్నారో స్పష్టంగా తేల్చలేకపోయాయి.
ఈ కేసు విచారణలో భారత్-పాకిస్థాన్ మధ్య కశ్మీర్ కోసం జరిగిన యుద్ధం కీలక అంశంగా చర్చకు వచ్చింది.
1947-48లో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగిన తర్వాత 1949లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
అయితే, ఈ ఒప్పందంపై కొందరు గిరిజన యోధులు, సైనిక వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
వివరాలు
దర్యాప్తు.. అనుమానాలెన్నో!
కశ్మీర్ విషయంలో ఆశించిన ఫలితం దక్కలేదనే ఆగ్రహమే లియాఖత్ అలీ ఖాన్ హత్యకు కారణమై ఉండొచ్చనే వాదన కూడా తెరపైకి వచ్చింది.
హంతకుడు సయీద్ అక్బర్‌కు కశ్మీర్ వివాదంతో సంబంధం ఉన్నట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి.
కశ్మీర్లోకి చొరబడేందుకు తాను ఒక సైనిక దళాన్ని (లష్కర్) నడిపిస్తానని అతడు గతంలో ప్రతిపాదించినట్లు సమాచారం.
అయితే,ఈ వాదనలకు తగిన ఆధారాలు లేవని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.
సయీద్ అక్బర్ ఆఫ్ఘన్ రాచరికంతో విభేదాల కారణంగా పాకిస్థాన్‌కు వచ్చి అబోట్టాబాద్‌లో నివసించేవాడు.
అక్కడ ప్రభుత్వ భత్యంతో జీవించేవాడని సమాచారం.అతడు హత్యకు ఉపయోగించిన జర్మన్ తయారీ 9ఎంఎం పిస్టల్‌ను కశ్మీర్ నుంచి తిరిగొచ్చిన ఒక ముజాహిద్ నుంచి పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
వివరాలు
దర్యాప్తు.. అనుమానాలెన్నో!
ఈ అంశం కశ్మీర్ వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చనే అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.
అదే సమయంలో, కాల్పుల విరమణ ఒప్పందంపై అసంతృప్తితో ఉన్న కొందరు సైనికాధికారులు పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న 'రావల్పిండి కుట్ర కేసు'తో ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ విచారణ సాగింది.
అయితే, ఈ రెండు ఘటనల మధ్య సంబంధాన్ని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు లభించలేదు.
వివరాలు
హంతకుడిని ఎందుకు చంపేశారు?
లియాఖత్ అలీ ఖాన్ హత్య జరిగిన చాలా ఏళ్ల తర్వాత సయీద్ అక్బర్ కుమారుడు ఫరూఖ్ బబ్రాక్జాయ్ ఒక పుస్తకాన్ని ప్రచురించారు.
అందులో తన తండ్రిని సజీవంగా పట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు వెంటనే కాల్చి చంపారని ప్రశ్నించారు.
దర్యాప్తు విధానంపై పలు సందేహాలు వ్యక్తం చేశారు.
నిందితుడిని విచారించి ఉంటే హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, ఇతరుల ప్రమేయం గురించి కీలక సమాచారం తెలిసి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
75 ఏళ్ల తర్వాత కూడా సమాధానం లేని ప్రశ్నలు
లియాఖత్ అలీ ఖాన్ హత్య జరిగి ఏడు దశాబ్దాలకు పైగా గడిచినా కేసులోని ప్రధాన ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు.
ఆయనను హత్య చేయడానికి వ్యక్తిగత కక్ష కారణమా? కశ్మీర్ వివాదంపై అసంతృప్తే ఈ ఘటనకు దారితీసిందా? లేక అంతర్జాతీయ శక్తుల ప్రమేయంతో ఏదైనా కుట్ర జరిగిందా? అనే అంశాలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి.
నిందితుడిని వెంటనే కాల్చి చంపడం, దర్యాప్తు సంస్థలు స్పష్టమైన నిర్ధారణకు రాకపోవడం, వివిధ కోణాల్లో అనుమానాలు వ్యక్తం కావడం ఈ కేసును మరింత సంక్లిష్టంగా మార్చాయి.
పాకిస్థాన్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన లియాఖత్ అలీ ఖాన్ హత్య.. నేటికీ అంతుచిక్కని చీకటి అధ్యాయంగానే మిగిలిపోయింది.